సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం విపక్షంలో ఉన్న వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కాబోతున్నారు. జనసేనలో ఆయన ఎప్పుడు చేరనున్నారనే విషయంపై నేడు స్పష్టత రానుంది.
ఇదిలా ఉంటే.. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. బాలినేని బాటలోనే మరో కీలక నేత జనసేనలోకి జంప్ అవ్వబోతున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, జగన్ కు మరియు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు.
అలాగే ఈ నెల 22న తన అనుచరులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ఉదయభాను ప్రకటించారు. శుక్రవారం జగ్గయ్యపేటలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు కూడా తెలిపారు. ఇక ఆయన రాకను స్వాగతిస్తూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం విశేషం. కాగా, బాలినేని తరహాలోనే ఉదయభాను కూడా మొదట వైసీపీకి రాజీనామా చేసి.. ఆపై జనసేన కండువా కప్పుకోబోతున్నారు.