టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు… ప్రతిపక్షం వైసీపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హతే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ నాయకులపై చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు.. ఇలాంటి పార్టీని, ఇలాంటి నాయకులను సంఘ బహిష్కారం చేయాలని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల వరద వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఆహా రం తాగునీరు అందించే పనులు కొనసాగుతున్నాయి. అయితే.. మరోవైపు వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా మాత్రం.. అమరావతి రాజధాని మునిగిపోయిందని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కు నీరు, ఆహారం లేక అలమటిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంపై సీఎం చంద్రబాబు బుధవారం తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధాని సేఫ్‌గానే ఉందని.. గంటల తరబడి కురిసిన వర్షంతో ఇక్కడి రోడ్లు కొంత నీటితో నిండాయని.. తర్వాత పదినిమిషాలకే అంతా బాగైందని చెప్పారు. కానీ, దీనిని వైసీపీ వ్యతిరేక కోణంలో ప్రచారం చేసి.. ఏదో జరిగిపోతోందన్న కలరింగ్ ఇస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.ఇ లాంటి విమర్శలను ప్రజలు నమ్మరాదని చంద్రబాబు సూచించారు.
ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసే పార్టీలు.. ప్రజలను ఇబ్బంది పెట్టే పార్టీలు, సమాజంలో ఏదో అలజడి సృష్టించే పార్టీలను సంఘ బహిష్కరణ చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరిదీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.