అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలకు బాగా ఇన్స్ పైర్ అయిన వైసీపీ నేతలు….చెట్టు, పుట్ట, కరెంటు స్తంభం, బోరింగు, ప్రభుత్వ కార్యాలయాలు, చెత్త సేకరించే బండ్లు కావేవీ వైసీపీ రంగులకనర్హం అని జగనన్న జమానాలో నయా కవులుగా మారడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నా…వైసీపీ నేతల తీరుమాత్రం మారడం లేదు.
చివరకు గత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి రంగు రంగుల విద్యుత్ బల్బుల దండలకు బదులుగా…తమ పార్టీ జెండా రంగులు వేసి చివాట్లు తిన్నారు. భారతీయులకు జాతీయ జెండా మాదిరిగా తమకు వైసీపీ జెండా అని ఫీలవుతున్న వైసీపీ నేతల వైనంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా సరే వారి తీరు మారలేదు. తాజాగా వైసీపీ అధినేత జగన్ మరోసారి తన రంగుల కలను సాకారం చేసుకోబోయి భంగపడ్డ వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే చిక్కీల ప్యాకెట్లపై జగన్ బొమ్మ వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు, 5 స్టార్ చాక్లెట్ మాదిరిగా ప్యాకెట్ లో చిక్కీని పెట్టిన వైసీపీ నేతలు…ఆ ప్యాకెట్‌పై జగన్ బొమ్మతోపాటు..ప్యాకెట్ కవర్ ను పార్టీ జెండాను పోలిన రంగుతో పులిమేసి తమ పైత్యాన్ని మరోసారి చాటుకున్నారు. వాస్తవానికి 10-15 చిక్కీలను ఒకే కవర్ లో ఇచ్చేవారు. కాబట్టి కవర్ ఖర్చు కూడా తగ్గేది. కానీ, జగన్ రంగుల ఫ్యాంటీసీ పుణ్యమా అంటూ…చారానా కోడికి బారానా మసాలా టైపులో ఖర్చు తడిసి మోపెడవుతోంది.