వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో ఉన్న వైసీపీ అభ్యర్థులు.. దొడ్డిదారులనే ఎంచుకున్నారనే వాదన విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు.. ఎక్కడికక్కడ వలంటీర్లను అడ్డంగా వాడేస్తున్నారు. వారిని కూడా తమతో తిప్పేసుకుని, ప్రజలకుతాయిలాలు పంచేస్తూ.. మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిసి కూడా నాయకులు ఎక్కడా వెనుకాడక పోవడం గమనార్హం. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కమ్ అభ్యర్థి వెంకటేగౌడ్పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.
ఏం చేశారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇక, అసెంబ్లీ సహా లోక్ సభ ఎన్నికలు కూడా జరిగే.. ఏపీలోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కోడ్‌ను అధికార పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం అమల్లో ఉన్న విషయమైనా వారు మరిచిపోయినట్టుగా నటిస్తున్నారు. తాజాగా పలమనేరు ఎమ్మెల్యే కమ్ వైసీపీ అభ్యర్థి వెంకటే గౌడ్ పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట గౌడ ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడంటూ ఈసీ చర్యలకు దిగింది.
ఎమ్మెల్యే ఫొటోలతో ఉన్న ప్యాడ్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడాన్ని పలమనేరు నియోజకవర్గంలోని పలు మండ లాల్లో ఎగ్జామినర్లు గమనించారు. దీనిపై వారు పలమనేరు ఆర్డీవో మనోజ్ రెడ్డికి సమాచారం అందించారు. ఇదే విషయంపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో, ఆర్డీవో పలమనేరు ఎమ్మెల్యేపై వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు షోకాజ్ నోటీసులు అందించారు. ఏదేమైనా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కనీసం కోడ్‌కు కూడా విలువ ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.