ఏపీలో స్థానిక సంస్థల వ్యవహారంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోకల్ వార్ కు ఎస్ఈసీ సిద్ధమవుతుండగా… కరోనా, వ్యాక్సిన్ కారణంగా ఎన్నికల నిర్వహణ కష్టమంటోంది ఏపీ సర్కార్. ఈ వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరడంతో ఎస్ఈసీతో ప్రభుత్వం చర్చించాలని, కానీ,ఎస్ఈసీదే తుది నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో, ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సుముఖంగా లేని ప్రభుత్వం ఏదో ఒక వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో 6 నెలల పాటూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తయ్యాక ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విజయసాయి హింట్ ఇచ్చారు. తాజాగా విజయసాయి ఇచ్చిన స్టేట్ మెంట్ ను బట్టి చూస్తే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసేవరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం జగన్ కు లేదన్న విషయం స్పష్టమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
గత కొద్ది నెలలలుగా ఏపీ సర్కార్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలుపెరుగని పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి మరీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని నిమ్మగడ్డ దక్కించుకున్నారు. కోర్టు ఆదేశాలతో 2021 మార్చి వరకూ నిమ్మగడ్డ ఏపీ ఎస్ ఈసీ పదవిలో కొనసాగుతారు. దీంతో, ఎలాగైనా నిమ్మగడ్డపై కక్ష సాధించాలని ఫిక్సయిన జగన్ సర్కార్….ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని కుంటిసాకులు వెతుకుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ….కరోనా, వ్యాక్సిన్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి, తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు…నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నపుడు ఎన్నికల నిర్వహణకు మాత్రం విముఖత వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. నిజంగా వైసీపీకి ఎన్నికల్లో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంటే….ఎస్ ఈసీగా నిమ్మగడ్డ ఉన్నా…జస్టిస్ కనగరాజ్ ఉన్నా….మరో అధికారి ఉన్న పెద్దగా నష్టం లేదు.
ప్రజా తీర్పు తమవైపుందని వైసీపీ నమ్మి ఉంటే….నిర్భయంగా నిమ్మగడ్డ అడిగిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలకు సిధ్ధమై ఉండేదన్న భావన వ్యక్తమవుతోంది. కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు, దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి విషయాల నేపథ్యంలో వైసీపీ మైలేజీ తగ్గిందని, అందుకే ఇప్పుడు ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదన్న భావన వైసీపీ నేతల్లో ఉందని విమర్శలు వస్తున్నాయి. మరో రెండు నెలలు ఆగితే…పరిస్థితులు సద్దుమణగడం…నిమ్మగడ్డ రిటైర్ కావడం వంటి పరిణామాలు తమకు అనుకూలంగా మారతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా…ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయం వైసీపీని వెంటాడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.