కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలలో గరంగరంగా వినిపిస్తున్న పేరు గన్నవరం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనను గన్నవరం టీడీపీ ఇన్చార్జ్గా నియమిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం వెంకట్రావును గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా నియమించారు.
అంతకుముందు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, శ్రేణులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావును నియమిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. గన్నవరం టిడిపి ఇన్చార్జిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పిన యార్లగడ్డ హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం టిడిపి కంచుకోట అని, 2024లో గన్నవరంలో పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు. 2019లో టీడీపీ బీఫారమ్ పై గెలిచిన వంశీ వైసీపీకి జై కొట్టినా…టీడీపీ శ్రేణులు మాత్రం పార్టీని నమ్ముకొని ఉన్నాయని అన్నారు.
రౌడీయిజం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేసినందుకే వచ్చానని చెప్పారు. అందరు నాయకులను కలుపుకుపోతానని, ఏవైనా సమస్యలుంటే కార్యకర్తలు తనకు చెప్పాలని అన్నారు. గన్నవరంలో లోకేష్ పాదయాత్రలో యార్లగడ్డ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఓకే అంటే గుడివాడలో పోటీకీ సై అని ఆయన ప్రకటించారు. హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ లను కొడాలి నాని వాడుకొని వదిలేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.