కొద్దిరోజులుగా గన్నవరం వైసీపీలో రాజకీయాలు గరంగరంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్న రీతిలో అక్కడ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తనకు వైసీపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని యార్లగడ్డ వెంకట్రావు కొద్దిరోజుల క్రితం కోరారు. తనకు మూడేళ్లుగా జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదని మీడియా సాక్షిగా వాపోయారు. అయితే, రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ తేల్చి చెప్పారు.
దీంతో, ఆయన టీడీపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సజ్జల కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కష్టం, ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేస్తాం అని యార్లగడ్డనుద్దేశించి వ్యాఖ్యానించారు. పోతే పోనీ అనే రీతిలో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టుగా పరోక్షంగా యార్లగడ్డ కామెంట్స్ చేశారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరతానని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. అయితే, టీడీపీ తనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదని చెప్పుకొచ్చారు.
జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదని, గన్నవరం నుంచి రాబోయే ఎన్నికలలో గెలుపొంది అసెంబ్లీలోనే ఆయనను కలుస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్, గన్నవరం నుంచి తాను గెలిచి అసెంబ్లీకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లలో చంద్రబాబు, లోకేష్ లను కలిసినట్టుగా నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని, ఎన్నికలలో పోటీ చేయనని యార్లగడ్డ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో యార్లగడ్డ చేరిక లాంఛనమే అని స్పష్టమవుతోంది. గన్నవరంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా యార్లగడ్డ టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.