టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబు, పవన్ ల భేటీని చూసి భయపడిపోయిన వైసిపి నేతలు వారి సమావేశంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకోబోతున్నాయని, ఆ పొత్తుపై చర్చించేందుకే చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారని ప్రచారం చేస్తున్నారు. అయితే, కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకే వెళ్లానని పవన్ క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు. ఆ ఇద్దరు భేటీ చూసి వైసిపి నేతలు భయపడుతున్నారని, వారు చేస్తున్న కువిమర్శలే అందుకు నిదర్శనమని యనమల మండిపడ్డారు. చంద్రబాబుతో పవన్ మైత్రిని చూసి అక్కసు పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసం చూరగొన్నందువల్లే 40 ఏళ్లుగా టిడిపి ప్రజాధరణ పొందుతోందని చెప్పారు. 2024లో 1983 కంటే ఘనంగా టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అందుకే, జగన్, ఆయన ప్రభుత్వం, వైసిపి నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. జగన్ తన ఆస్తులు పెంచుకోవడానికి, కబ్జాలు చేయడానికి మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. పవన్ పార్టీ యాక్టివ్ గా ఉందని, ఆయన నిలదొక్కుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిస్తే తప్పేంటని యనమల ప్రశ్నించారు. ఆ మాటకొస్తే మోడీని జగన్ వెళ్లి కలవడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ మాట్లాడుకున్న ఆంతరంగిక విషయాలు ఎందుకు బయట పెట్టాలని నిలదీశారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుందన్నారు.