ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో సమీపిస్తుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనంలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. చంద్రబాబు పర్యటనలకు అనూహ్య స్పందన వస్తున్నటువంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో టిడిపిదే విజయం అని తెలుగుతమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. జగన్ ను ఓడించడానికి కలిసికట్టుగా పోరాడాల్సిన ఈ తరుణంలో యనమల వంటి కొందరు టిడిపి నేతలు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు.
తాజాగా తుని టికెట్ విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పార్టీకి డ్యామేజీ కలిగించేలా కనిపిస్తోంది. తుని అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ యనమల రామకృష్ణుడి తనయురాలు దివ్యకు ఇవ్వాలని టిడిపి అధిష్టానం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తొండంగికి చెందిన టిడిపి నేత ఒకరితో యనమల కృష్ణుడు మాట్లాడినట్టుగా భావిస్తున్న ఒక ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడం సంచలన రేపుతోంది.
తుని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కృష్ణుడు….ఆ నేతతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా పుకార్లు వస్తున్నాయి. ప్రతి ఊరి నుంచి 40 మంది యనమల రామకృష్ణుడి దగ్గరికి వెళ్లాలని, యనమల కృష్ణుడు కష్టపడితే దివ్యకు సీటు ఇస్తారా అని ప్రశ్నించాలని ఆ ఆడియో కాల్ లో అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కృష్ణుడు లేకపోతే తునిలో టిడిపి గల్లంతవుతుందని, దివ్య ఇంట్లోనే ఉండే మనిషని రామకృష్ణుడితో చెప్పాలని అన్నట్టుగా ఫోన్ కాల్ లో ఉంది.
ఇక, దివ్యకు, కృష్ణుడికి ఇద్దరికీ టిక్కెట్ వద్దని, ఈసారి కూడా దాడిశెట్టి రాజానే గెలుస్తాడన్న అంచనాలున్నాయని రామకృష్ణుడితో చెప్పాలంటూ ఆ ఫోన్ సంభాషణలో ఉంది. అయితే, లీకైన ఆడియోలో మాట్లాడింది యనమల కృష్ణుడా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఆడియో లీక్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఆ ఆడియో వ్యవహారంపై యనమల కృష్ణుడు స్పందించారు. తమ సంభాషణలను ప్రతిపక్ష నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అన్నదమ్ములం కలిసే ఉన్నామని చెబుతున్నారు.