ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడం సంగతి పక్కన పెడితే అప్పుల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానాలోని డబ్బును పప్పు బెల్లం లాగా జగన్ పంచి పెడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్ష నేతలు అధికార పక్షంపై విమర్శలు చేయడం సహజం అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే జగన్ చేస్తున్న అప్పులపై జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఇక, జగన్ ఏపీలో ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి అప్పేనని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా పలుమార్లు నివేదికలో వెల్లడించింది. అప్పులు చేస్తే చేశారు కానీ ఆ చేసిన అప్పులకి సరిగ్గా లెక్కలు కూడా చూపడం లేదని పలుమార్లు ఆరోపించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ తన పరిధికి మించి అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు హెచ్చరించింది.
అయినా సరే జగన్ తీరు మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందంటూ కాకి లెక్కలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు జగన్. చంద్రబాబు అప్పులు ఎక్కువ చేశారని, తన హయాంలో అప్పులు తక్కువగా జరిగాయని జగన్ తాజాగా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు.
మరోసారి అబద్ధపు ప్రచారానికి జగన్ తెరతీశారని యనమల విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని యనమల ఎద్దేవా చేశారు. ఏపీ అప్పులపై జగన్ మంత్రులు తలా ఒక మాట పూటకో పాట పాడుతున్నారని చురకలంటించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్ కు యనమల సవాల్ విసిరారు.
ఏపీ ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా అని యనమల ప్రశ్నించారు.1956 నుంచి 2019 వరకు 2,53 వేల కోట్లు అప్పు చేసిందని, మూడున్నరేళ్లలోనే జగన్ 6,38,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శలు గుప్పించారు. టిడిపి హయాంలో చేసిన మొత్తం అప్పు 1,63,981 కోట్లు అని గుర్తు చేశారు.