కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్నాటక బీజేపీ తో పాటు బీజేపీ జాతీయపార్టీలో కూడా సంచలనంగా మారాయి. సరిగ్గా ఉపఎన్నికలకు ముంద యడ్డీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతాలో అర్ధంకాక పార్టీ నేతలు+ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్నారు. తొందరలోనే హనగల్, సింథి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు టార్గెట్ గా పార్టీ ప్రత్యేకంగా వ్యూహకమిటిని నియమించింది.
ఈ కమిటి సమావేశంలోనే యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ యడ్డీ ఏమన్నారంటే ‘రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలంటే నరేంద్రమోడి వేవ్ ఒక్కటే సరిపోదు’ అని వ్యాఖ్యానించారు. హఠాత్తుగా యడ్డీ చేసిన వ్యాఖ్యలకు అర్ధమేంటో తెలీక నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తనను అర్ధాంతరంగా సీఎం పదవినుండి తొలగించినందుకు ఆయనకు నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైన కూడా పీకలదాకా మండిపోతోందట.
రెండు విషయాలపై యడ్డీకి బాగా కోపంగా ఉంది. మొదటిదేమో తనను సీఎంగా తనను తప్పించటం. రెండో కారణం ఏమిటంటే తన కొడుకుని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోకపోవటం. సీఎం పదవినుండి తాను తప్పుకోవాలంటే తన కొడుకుకు మంత్రిని చేయాలని యడ్డీ చేసిన డిమాండ్ ను అప్పట్లో అమిత్ షా అంగీకరించారట. అయితే సీఎంగా తప్పుకుని బసవరాజబొమ్మై సీఎం అయిన తర్వాత యడ్డీతో పాటు ఆయన కొడుకును కూడా బీజేపీ పట్టించుకోకుండా పక్కన పడేసింది.
ఆ కోపం యడ్డీలో పెరిగిపోతోందట. అందుకనే వ్యూహ కమిటి సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కమలనాదులు అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యడ్డీ సహకారం లేనిదే ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యంకాదు. పవర్ ఫుల్ కమ్యూనిటి లింగాయత్ కు చెందిన యడ్డీ చెప్పిందే వాళ్ళకు వేదం. ఒకవేళ యడ్డీ గనుక బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని సంకేతాలు ఇచ్చినా, లేదా సైలెంట్ గా కూర్చున్నా బీజేపీ గెలుపు కష్టమే.
మొత్తానికి మోడి వేవ్ పనికిరాదని యడ్డీ చేసిన వ్యాఖ్యలు గట్టి ప్రభావాన్ని చూపబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే యడ్డీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తీసుకెళిపోతోంది. నిజానికి కాంగ్రెస్ కు పై నియోజకవర్గాల్లో గట్టి పట్టే ఉంది. కాకపోతే అధికారంలో ఉండటం బీజేపీకి కలసివచ్చే ఏకైక అంశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు యడ్డీ చేతిలో ఉంది. అందుకనే యడ్యూరప్ప కేంద్రంగా కర్నాటక రాజకీయాల్లో జోరు పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో ఏమో.