వాళ్లేమీ గల్లీ ఆటగాళ్లు కాదు. అంతర్జాతీయ వేదికల మీద తమ సత్తా చాటటమే కాదు.. తమ ప్రతిభతో దేశ కీర్తి పతాకాన్ని వినువీధుల్లో ఎగురవేసిన మహిళా రెజ్లర్లు. వారిలో పలువురు ప్రపంచ చాంఫియన్ షిప్ తో పాటు.. ఒలింపిక్ పోటీల్లోనూ తమ బలాన్ని చూపించినోళ్లే. పతకాల్ని సొంతం చేసుకునే వారే. అలాంటి వారు పదుల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి భారత్ రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా తీసుకొని వారు నిరసననలు చేపట్టారు.
అయినప్పటికీ వారి పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నా.. కేంద్రంలోని మోడీ సర్కారులో మాత్రం చలనం లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. మూడో రోజు నిరసన చేపట్టిన క్రీడాకారులు.. భారత ఒలింపిక్ అసోసియేషన్ కు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులతో పాటు.. ఇతర ఇబ్బందుల్ని బయటపెట్టారు. అంతేకాదు.. తాజాగా వారు నాలుగు డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు.
అందులో ముఖ్యమైనది రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకల మీద విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. అంతేకాడు.. బ్రిజ్ భూషన్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని కోరుతున్నారు. సీనియర్ రెజ్లర్లతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా డబ్బులు కూడా ఇవ్వటం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. జాతీయ శిక్షణ శిబిరంలో అర్హత లేని కోచ్ లు చాలామంది ఉన్నారని వారుచెబుతున్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ పొగాట్ ను భారత రెజ్లర్ సమాఖ్య అధ్యక్షుడు మానసికంగా హింసించారని.. దీంతో ఆత్మహత్య చేసుకనే వరకు ఆమె వెళ్లినట్లుగా పేర్కొన్నారు. తాము ఎంతో ధైర్యం చేసి ఈ నిరసన చేస్తున్నామని.. అతడిపై చర్యలు తీసుకోకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకావం ఉందని వారు భయాందోళనల్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నట్లుగా తన వెనుక ఏ రాజకీయ నాయకుడు కానీ పారిశ్రామిక వేత్త కానీ లేరని స్పష్టం చేస్తున్నారు.
అయితే.. ఇంత జరుగుతున్నా తీవ్ర ఆరపణల్ని.. విమర్శల్ని ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. తాను ఎలాంటి తప్పులు చేయలేదంటున్నారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశానన్న అంశంపై మాట్లాడుతూ.. తాను ఎవరి కోసం.. ఎవరితోనూ మాట్లాడటం లేదని..తాను కష్టపడి పైకి వచ్చానని.. తాను ఎవరి దయతోనూ అధికారంలో లేనని స్పష్టం చేస్తున్నారు. తనపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ ఆందోళనలు భయానికి గురి చేస్తాయి. కానీ.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా ధైర్యాన్ని ప్రదర్శించటం చూస్తే.. ఇంత జరిగిన తర్వాత కూడా గ్రాము బలుపు కూడా తగ్గలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.