ఆన్ లైన్ స్నేహాలు.. ప్రేమలు.. పెళ్లి ప్రపోజల్ విషయాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఏ చిన్న తేడా వచ్చేసినా పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్న దానికి నిదర్శనంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకున్న ఈ క్రైం గురించి తెలిస్తే.. నోటి వెంట మాట రాదు. పెళ్లి పేరుతో కాస్తంత అడ్వాన్స్ అయిన ఐటీ ఉద్యోగికి హారర్ మూవీ చూపిన కిలేడీ వ్యవహారమిది.
లండన్ లోని ఒక ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగి.. కంపెనీ పని మీద బెంగళూరుకు వచ్చాడు. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా మ్యాట్రిమోనీ సంస్థలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి సాన్వి అరోరా అనే అమ్మాయి పరిచయమైంది. చాలా త్వరగానే ఇద్దరు కనెక్టు అయ్యారు. తరచూ ఫోన్లు మాట్లాడుకునే వారు.
పరిచయం పెరగటం.. త్వరలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వేళ.. సదరు అమ్మాయి ఐటీ ఉద్యోగి కాస్తంత అడ్వాన్స్ అయ్యేలా చేసింది. అయితే.. తాను ట్రాప్ లో పడుతున్న విషయాన్ని గుర్తించని అతడు.. ఆమెకు వీడియో కాల్ లో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. అయితే.. తాను చేసే పనుల్ని ఆమె వీడియో రికార్డు చేసిందన్న విషయాన్ని గుర్తించలేదు. ఆ రాత్రి తర్వాత నుంచి అతడికి నరకం ఎలా ఉంటుందో చూపించటం మొదలు పెట్టింది.
ముందు రోజు ఐటీ ఉద్యోగి చేష్టల్ని వీడియో రూపంలో పంపి.. బ్లాక్ మొయిల్ చేయటం మెదలు పెట్టింది. దీంతో షాక్ తిన్న అతగాడు.. ఆ వీడియోను బయటపెట్టొద్దని ప్రాధేయపడ్డాడు. దీంతో.. డబ్బులు గుంజటం మొదలు పెట్టింది. అలా మొదలైన టార్చర్ రూ.1.14 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా కంటిన్యూ కావటంతో బాధితుడికి ఏం చేయాలో పాలుపోలేదు. మరింత డబ్బు కావాలని డిమాండ్ చేయటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో వైట్ ఫీల్డ్ పోలీసుల్ని ఆశ్రయించాడు.
ఐటీ ఉద్యోగి వేదనను విన్నంతనే స్పందించిన పోలీసులు.. ఈ సైబర్ నేరానికి కళ్లం వేసేందుకు రంగంలోకి దిగారు. ఆమె ఖాతాలో ఉన్న రూ.80 లక్షల మొత్తాన్ని వేరే ఖాతాలోకి మళ్లించకుండా బ్లాక్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కిలేడీ కోసం గాలిస్తున్నారు. తియ్యటి మాటలకు ఏ మాత్రం టెంప్టు అయినా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.