నేటి రాజకీయాలు అంటే.. కక్షలు, కార్పణ్యాలకు ప్రతీకగా మారిపోయాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీలో కక్షా రాజకీయాలు మరింత పెరిగిపోయాయి. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రతి విషయంపైనా.. జగన్ ఏదో ఒక రూపంలో నిందలు వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి, ఆయన పార్టీ నేతలకు కూడా ఏదో ఒక మకిలి, మురికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో చేసిన మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఆఖరికి అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేయడం జైళ్లకు పంపేలా సెక్షన్లు విధించడం వంటివి మనకు కనిపిస్తున్నాయి.
ఇక, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ప్రస్తుతం గెలిచినా.. ఎలాంటి మరకలు లేని వారిని ఏం చేయాలి? ఏ విధంగా వారిని కట్టడి చేయాలి? -ఈ ప్రశ్నల నుంచే వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు వైసీపీకి మద్ద తుదారులుగా మారారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. ఇక, ఉన్నవారిలో ఓ నలుగురు మాత్రమే దూకుడుగా ఉన్నారు. ఇటు బయటా.. అటు అసెంబ్లీలోనూ వైసీపీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తున్నారు. దీంతో తాము ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నా మని చెబుతున్న వైసీపీకి టీడీపీ నేతల దూకుడు చెమటలు పట్టిస్తోంది.
ఈ క్రమంలోనే టీడీపీలో ఇటు బయటా.. అటు అసెంబ్లీలోనూ దూకుడుగా ఉన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడులపై ఏదో ఒకరకంగా కంట్రోల్ చేసేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. వీరిలోనూ నిమ్మలపై మరింత అక్కసుతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో నిమ్మలకు భారీ చెక్ పెట్టాలని, అచ్చెన్నకు కూడా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలను అడ్డు పెట్టుకుని.. సభలో ఇష్టాను సారం వ్యవహరించారని, అసత్యాలను ప్రచారం చేశారని పేర్కొంటూ.. నిమ్మల, అచ్చెన్నలపై చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీ సభా హక్కుల సంఘం భేటీ కానుంది.
వాస్తవానికి వీరిపై చర్యల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఈ భేటీ లాంఛనమేనని రాజకీయ వర్గాలు అంటున్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్..ఇప్పుడు అదే తరహాలోనిమ్మలపై ఏడాది పాటు వేటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక, అచ్చెన్న విషయంలోనూ కఠిన నిర్ణయమే ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే.. టీడీపీలో బలమైన గళాలు మూగబోయే ఛాన్స్ ఉంటుందని వైసీపీ భావిస్తోంది. మరి టీడీపీ ఏం చేస్తుంది? ప్రజల్లోకి వెళ్తుందా? ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది.