రాజమండ్రిలో రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి రోజు ప్రతినిధుల సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేదిక మీదకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు…జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. సైకిల్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని, సైకిల్ కు ఎలెక్ట్రిక్ హంగులు తీసుకొచ్చామని చెప్పారు. ఎలక్ట్రిక్ సైకిలు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉందని, అడ్డొచ్చిన వైసీపీ వంటి పార్టీలను తొక్కుకుంటూ ముందుకు పోవడమేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం అందరిలో కనిపిస్తోందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి ఎలక్ట్రిక్ సైకిల్ రెడీగా ఉందని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిందే టీడీపీ అని, ఎన్టీఆర్ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేసుకున్నారు. సంపద సృష్టించడం పార్టీకి కొత్త కాదని, 2029 నాటికి ఏపీని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రెడీ చేశామని అన్నారు.
జగన్ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో గట్టెక్కిస్తామని తెలిపారు. సైకో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని, ప్రజావేదికను కూల్చివేత మొదలు…ఇప్పటిదాకా అదే ధోరణిని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తండ్రిలేని బిడ్డనని, కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య అంటూ జగన్ అధికారంలోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. హోదా తెస్తానన్న జగన్… కేసుల కోసం కేంద్రం ముందు మోకరిల్లాడని ఎద్దేవా చేశారు.
నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఎంతో వేధిస్తున్నా టీడీపీ కార్యకర్తలు భయపడలేదని, వెనుకంజ వేయలేదని ప్రశంసించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.జగన్ అక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు అవసరమవుతాయని అన్నారు. రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదని… అన్ని నోట్లు జగన్ దగ్గరే ఉన్నాయని తెలిపారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4 విధానంతో పేద వాడిని ధనికుడిని చేసేందుకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని, ప్రజలందరితో టీడీపీ నాయకులు అనుసంధానం కావాలని చెప్పారు.