రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈరోజు పోలింగ్ జరగబోతోంది. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సోనియాగాంధీ, ఉత్తరప్రదేశ్ నేత జితేంద్ర ప్రసాద్ పోటీపడ్డారు. అప్పట్లో సోనియా బంపర్ మెజారిటీతో గెలిచారు. తర్వాత మళ్ళీ ఎన్నిక జరగటం ఇదే. అధ్యక్ష పదవికి ఇద్దరు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ చేస్తున్నారు. కర్నాటకకు చెందిన ఖర్గే, కేరళకు చెందిన థరూర్ ఇద్దరూ గతంలో కేంద్రమంత్రులుగా చేసినవారే.
సోనియాగాంధీ ఆశీస్సులున్నాయనే ప్రచారంతో ఎన్నికలోకి దిగిన ఖర్గేని థరూర్ ఓడించగలరని ఎవరు అనుకోవడం లేదు. అధ్యక్ష పదవికి ముందు రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపించింది. తర్వాత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరకు ఖర్గే నామినేషన్ వేయటంతో ఉత్కంఠకు తెరపడింది. ఇదే సమయంలో మొదటినుండి థరూర్ పేరు మాత్రం వినబడుతూనే ఉంది.
అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 9300 మంది నేతలు ఓట్లు వేయబోతున్నారు. పీసీసీ ప్రతినిధులంతా ఓటర్లే. వీరిలో కూడా అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం ఓట్లలో యూపీ నుండి ఎక్కువగా 1250 మంది ఓట్లేయబోతున్నారు. ఓటింగ్ కు వీలుగా ప్రతి రాష్ట్రంలోను పోలింగ్ కేంద్రాలను ఏఐసీసీ ఏర్పాటుచేసింది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు 19వ తేదీన ప్రకటించబోతున్నారు. ఖర్గేనే గెలుస్తారనే అభిప్రాయం అందరిలోను ఇప్పటికే వచ్చేసింది.
ఇక్కడ విషయం ఏమిటంటే థరూర్ అసలు డిపాజిట్లయినా తెచ్చుకుంటారా ? అన్నదే అసలు పాయింట్. ఎందుకంటే థరూర్ కు ఏరాష్ట్రంలోని నేతలు కూడా పెద్దగా సహకరించలేదు. ఆయన ప్రచారానికి వచ్చినపుడు పీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతల్లో చాలామంది మొహంచాటేశారు. ఇదే సమయంలో ఖర్గే ప్రచారానికి వచ్చినపుడు మాత్రం పీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఆయనను కలిసేందుకు పోటీలు పడ్డారు. దీంతోనే థరూర్ కు డిపాజిట్లు దక్కేది అనుమానంగా తయారైంది.