అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు కూడా తాజాగా తేల్చిన సంగతి తెలిసిందే. గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా…తాజాగా సుప్రీం కోర్టు చెప్పినా…వైసీపీ నేతలు మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే నమ్ముతున్నారు. అయితే, జగన్ ప్రకటించిన పరిపాలనా రాజధాని విశాఖ ఉన్న ఉత్తరాంధ్రలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా స్పందించారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటోన్నా ఎంతోమందిపై నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేయడం వల్ల 150 మందికి పైగా అమరావతి రైతులు అశువులు బాశారని, వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి సీఎం జగన్ ఓదార్చాలని కోరారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తేలాలని అన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని, తాను కూడా చేస్తానని రఘురామ ప్రకటించారు. తనపై అనర్హత వేటు పడదని, జగన్ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుందని అన్నారు. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారని, తన ఫోన్ పోలీసులు తీసుకున్నారని చెప్పారు. ”పెగాగస్ సాఫ్ట్వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.