టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం గత నాలుగు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరువూరు టీడీపీ ఆఫీస్ వేదికగా సోదరుడు కేశినేని చిన్నితో విభేదాలు తారస్థాయికి చేరడంతో నానికి ఈసారి టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడతానని నిన్న సంకేతాలు ఇచ్చిన నాని ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయబోతున్నానని ఆయన ప్రకటించారు.
త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తానని ట్వీట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఉన్న ఫోటోను నాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు భావించారని, ఆ తర్వాత కూడా పార్టీలో తన కొనసాగడం సబబు కాదని నాని అన్నారు. త్వరలోనే ఎంపీ పదవికి, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని నాని చెప్పారు.
ఇక, రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని గతంలో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఒక ఫ్లైట్ టికెట్ దొరక్కపోతే మరో ఫ్లైట్ ఎక్కుతామని, అదీ లేకపోతే ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేస్తామని నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విజయవాడను అభివృద్ధి చేసిన తాను ఖాళీగా కూర్చుంటే ప్రజలు, అనుచరులు ఒప్పుకోరని నాని అన్నారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో నాని వైసీపీ లేదా బీజేపీ తరఫున లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయ. ఏదేమైనా, తన రాజీనామా ప్రకటనతో ఈ ఎపిసోడ్ కు నాని తెరదించినట్లే కనిపిస్తోంది. మరి, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నది ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా మారింది.