రాజకీయాలు, సినిమాలు…ఈ రెండు రంగాలకు ఏదో అవినాభావ సంబంధం ఉందని చాలామంది అంటుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో చాలామంది సినీ తారలు రాజకీయ రంగంలోనూ తారా జువ్వలుగా వెలుగులు చిమ్మారు. తమిళనాట ఎంజీఆర్, జయలలిత..తెలుగునాట విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావులు ఈ కోవలోకి వస్తారు.
తమిళనాట విజయ్ కాంత్, తెలుగునాట చిరంజీవిలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమయ్యారు. విజయ్ కాంత్ ఇంకా రాజకీయాల్లో ఉన్నా…పెద్దగా రాణించింది లేదు. ఇక, చిరంజీవి రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇక, పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాలు…అటు సినిమాలు అంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నారు.
అయితే, ఇటు రాజకీయాలను, అటు సినిమాలను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టే, ఈ రాజకీయాలు నాకొద్దంటూ తలైవా రజనీకాంత్ రాజకీయాలలో అరంగేట్రం చేయకుండానే స్వస్తి పలికారు.ఇలా రెండు పడవలపై కాలు వేసి బ్యాలెన్స్ చేస్తూ రాణించిన వారి జాబితా తక్కువే అని చెప్పాలి. ఎంజీఆర్, ఎన్టీఆర్ కు మాత్రమే అది సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటోన్న నటుడు కమల్ హాసన్ తన సినీ కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయాలకు ఆటంకం కలిగిస్తాయనుకుంటే సినిమాలకు స్వస్తి పలుకుతానని కమల్ సంచలన ప్రకటన చేశారు. అయితే, ఇప్పటికే ఒప్పుకున్న పూర్తి చేస్తానని వెల్లడించారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకే కొన్ని సినిమాలు చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నానన్నారు.
గతంలో ఎంజీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించారని గుర్తు చేశారు. తన పార్టీ నడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికే ఎంజీఆర్ నటించారని, తాను కూడా అంతేనని అన్నారు. తాను సినిమాల్లో సంపాదించినదంతా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నానని, తన నిజాయతీని ఎన్నికల సంఘం అధికారులు ప్రశంసించారని కమల్ వెల్లడించారు.
అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కమల్ తరహాలోనే రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. కానీ, ఆ తర్వాత పార్టీ నడిపేందుకు డబ్బులు కావాలన్న విషయాన్ని గ్రహించి పార్ట్ టైం పొలిటిషియన్ గా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి, పవన్ లాగే కమల్ కూడా యూటర్న్ తీసుకుంటారా లేక అన్నమాటకు కట్టుబడతారా అన్నది తేలాల్సి ఉంది. తమిళనాట కమల్ మరో ఎంజీఆర్ అవుతారా లేదా పవన్ అవుతారా అన్నది వేచి చూడాలి.