వైసీపీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా గురించి నీకు తెలీదు. ఫుట్ బాల్ ఆడిస్తా.. ఏమనుకుంటున్నా వో“ అంటూ.. వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో ఒక్కసారిగా.. నియోజకవర్గంలో రాజకీయ కాక తీవ్రస్థాయికి చేరింది. ‘నేదురుమల్లి ఇష్టానుసారం మాట్లాడితే పడేవాళ్లు లేరు. మాకు నీ అంత ప్రావీణ్యం లేకపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం నిన్ను ఫుట్‌బాల్ ఆడిస్తా“ అని ఆనం అన్నారు.
అంతేకాదు.. “వెంకటగిరిలో ఫుట్‌బాల్ ఆడేవాళ్లను తయారు చేస్తా. ఈసారి నీకేం పగులుతుందో నాకే తెలియదు. నేదురుమల్లి చదువుకుంటే సరిపోదు.. సంస్కారం నేర్చుకో. సంస్కార హీనులను వెంకటగిరి ప్రజలు ఆదరించరు“ అని ఆనం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తనను ఓడించాలనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత జగన్ తనకు వెంకటగిరి నియోజకవర్గం టికెట్ ఇచ్చారని ఆనం వ్యాఖ్యానించారు. అయితే.. తనను నమ్మి ఇక్కడి ప్రజలు గెలిపించారని… జగన్ ఫొటోతో మాత్రం కాదని వ్యాఖ్యానించారు.
వెంకటగిరి నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా ఉందని ఆనం అన్నారు. “వైసిపి వెంకటగిరిలో ఒక్కసారి టికెట్ ఇచ్చింది. వైసిపికి స్థానిక సంస్థలు, తిరుపతి ఉప ఎన్నికతో కలిపి నాలుగుసార్లు విజయం అందించాను. నేదురుమల్లి గడచిన ఎన్నికల్లో నీ ప్రతాపం చూశాను. రేపు మూడోసారి ఆడాలనుకుంటే నాకేమి ఇబ్బంది లేదు. వెంకటగిరిలో ఫుట్ బాల్ ఆడేవాళ్ళను తయారు చేస్తా!. ఏదైనా సంస్కారమైన మాటలు మాట్లాడుకుంటే మంచిది.“ అని ఆనం అన్నారు.
వెంకటగిరికి ఒక చరిత్ర ఉందని ఆనం వ్యాఖ్యానించారు. అయితే, ఒకరి ఇద్దరి వల్ల ఈ చరిత్ర చెడిపోతోందని ఆనం అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా 6 నెలలు జస్ట్ గ్యాప్ ఇచ్చానని ఆయన తెలిపారు. “నేను ఫుట్ బాల్ ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నా… నిన్ను వెంకటగిరిలో ఉన్న ఆరు మండలాల్లో ఫుట్ బాల్ ఆడిస్తాస`. అని నేదురుమల్లి రామ్‌కుమార్‌ను ఆనం హెచ్చరించారు.