జగన్ హయాంలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారి కబ్జాలకు పాల్పడిన వైనంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. భూములే కాదు..ఆఖరికి అడవులు, సహజ వనరులను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలను జగన్ అండ్ గ్యాంగ్ కూడబెట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒక పార్టీని నమ్మి ప్రజలు ఓటేసి ఐదేళ్లు పాలన చేయాలని కోరారని, దాని అర్థం ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తులకు, సహజ వనరులను, అటవీ సంపదను దోచుకోమని కాదని దుయ్యబట్టారు. పెత్తందారీతనంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించమని ప్రజలు చెప్పలేదని విరుచుకుపడ్డారు. పంచభూతాలను మింగేసిలా వైసీపీ నేతలు సహజ వనరులను దోచుకున్నారని మండిపడ్డారు. భూములపై వివాదాలు రేపి వాటిని కొట్టేయాలన్న పరిస్థితికి వచ్చారని అన్నారు.
రికార్డుల్లో కొంతవరకే సమాచారముందని, దాని కంటే ఎక్కువే దోపిడీ అయిందని ఆరోపించారు. వైసీపీ కార్యాలయాల కోసం, జగనన్న ఇళ్ల స్థలాల కోసం కబ్జాలకు పాల్పడ్డారని, భూములు దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రాచబాట వేసుకున్నారని అన్నారు. రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించారని, కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని ఎకరా లక్ష రూపాయలు చొప్పున శారదా పీఠానికి కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ప్రజలంతా తమ భూములు సరిచూసుకోవాలని, తమ భూమి కబ్జాకు గురైనట్లు తెలిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని చెప్పారు గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఏపీలో కూడా తెస్తామని, కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.