కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అని తలపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధిస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు పలుమార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం విధించే సెసె వల్లే పెట్రోల్ రేట్లు పెరిగాయని, కేంద్రం సెస్ ను ఎత్తివేస్తే లీటరు పెట్రోలు రూ.70కే ఇస్తామని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, డీజిల్ ధర రూ.60కి తగ్గించవచ్చని చెప్పారు. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అలయన్స్-పని చేయని కూటమి) ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగాయని ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించలేదని, అందువల్లే ఆయా రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయని లోక్‌సభలో పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దీంతో, ఇంధనంపై వ్యాట్ తగ్గించనందు వల్లే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం నిందించడంపై కేటీఆర్ స్పందించారు.
తాము ఒక్కసారి కూడా కూడా వ్యాట్ పెంచలేదని, అయినా సరే ఇలా పార్లమెంటులో తమ రాష్ట్రం పేరు పేర్కొనడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మోదీ చెప్పే సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా? అని కేటీఆర్ నిలదీశారు. 2014 నుంచి ఇంధనంపై వ్యాట్‌ను తెలంగాణలో పెంచలేదని, ఒక్కసారి మాత్రమే రౌండాఫ్ చేసిందని స్పష్టం చేశారు. సెస్ కారణంగా తమ వాటాలో 41 శాతాన్ని పొందలేకపోతున్నామని, సెస్‌ను రద్దు చేస్తే దేశం మొత్తం మీద రేట్లు తగ్గుతాయని చురకలంటించారు.