గత వైసీపీ పాలనలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, వాటిలో సోషల్ మీడియా కేసులు సంఖ్య చాలా ప్రత్యేకం. ఎంతోమంది కార్యకర్తలు చాలా డేరింగ్‌గా సోషల్ మీడియాలో ప్రభుత్వంతో పాటు అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలతో పాటు అక్రమ కేసులపై రియాక్షన్ మొదలైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సోషల్ మీడియాలో పెట్టిన మొదటి పోస్టు మీద పెట్టిన కేసు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నానిని కష్టాల్లోకి నెట్టేస్తుందా ? నాని అధికారంలో ఉన్నప్పుడు చేసిన చిన్న తప్పులే ఇప్పుడు పాలిట శాపాలుగా మారబోతున్నాయా ? అంటే అవునన్న టాక్ బందరు వర్గాల్లో వినిపిస్తోంది.
2019 ఎన్నికల ప్రచారంలో పేర్ని నాని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలు వక్రీకరించి.. తన పరువుకు భంగం కలిగించేలా చేశారంటూ ఏప్రిల్ 9, 2019న నాని పోలీసులకు ఫిర్యాదు చేయగా… అదే యేడాది మే 5న చిలకలపూడి పోలీసులు విచారణ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అదే యేడాది జూన్ 24న బందరు కోర్టు ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త తుమ్మల చందు జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది. అప్పటి నుంచి పేర్ని నాని టార్గెట్ పెట్టడంతో చందు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవిడ్ టైంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా… ఎలాంటి న్యాయం లేకుండా వెనక్కు తగ్గకుండా పోరాటం చేశాడు.
సాధారణంగా ఫిర్యాదు దారుడు కోర్టు చుట్టూ తిరుగుతుంటే… ముద్దాయిలు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్‌లో జరిగేది… మంత్రి పదే పదే బిజీగా ఉన్నారు.. కోర్టుకు రావడం కుదరదు అన్న ఆన్సరే కోర్టుల్లో వినిపించేది. ముగ్గురు జడ్జ్‌లు మారినా పదే పదే మంత్రి డుమ్మా కొట్టడంతో సహనం నశించిన చందు తనపై ఫిర్యాదు చేసిన పేర్ని నాని కోర్టుకు రావాలంటూ పోరాటం తీవ్రతరం చేశారు. ఇక ఈ యేడాది ఎన్నికలకు ముందు పేర్ని నాని దిగివచ్చారు.. రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు.
అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డ చందు మాత్రం రాజీ సమస్యే లేదు అని తేల్చి చెప్పడంతో పాటు అధికారం మారడంతో నాని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనకు ఏపీపీ కావాలన్న ఒక్క మాట చెప్పి నాని వెళ్లిపోయారు. అయితే 2009 తర్వాత కోర్టు ముఖం చూడని తనను ఓ సాధారణ కార్యకర్త కోర్టు మెట్లు ఎక్కించాల్సి రావడం పట్ల పేర్ని నాని తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారన్న టాక్ కూడా వినిపించింది. అప్పట్లో మాజీ మంత్రితో పాటు అధికార గణం నుంచి తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… ఇటు తనకు ఎలాంటి సాయాలు అందకున్నా పార్టీ పట్ల ఉన్న పిచ్చి అభిమానమే తనను ఒంటరి పోరాటం చేసేలా చేసిందని చందు అంటూ ఉంటారు. కోర్టులో సమన్లు జారీ చేయమని చెప్పినా తాను గట్టిగా ఒత్తిడి చేస్తే కాని ఖాకీలు సమన్లు ఇవ్వేలేదని కూడా చందు చెప్పాడు.
బాబు గారి చందు లాంటి బాధితుల గోడు పట్టదా…!
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టించుకున్న.. అప్పట్లో దుర్మార్గపు పాలపై పోరాటం చేసిన వారికి ఇప్పుడు అయినా న్యాయం చేస్తారా ? బాబు గారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన పదవులు ఇస్తోన్న పార్టీకి చందు లాంటి నాయకులు ఎందుకు కనిపించరో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ ఘాటు డైలాగుల తర్వాత అక్రమ కేసుల్లో ఇరుక్కున్న కార్యకర్తలకు అండగా ఉంటాం… పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం అంటోన్న ప్రభుత్వ పెద్దలకు తుమ్మల చందు లాంటి బాధితుల ఘోడు ఎప్పటకి పడుతుందో ? చూడాలి.