ఏపీ సీఎంగా చంద్రబాబు మరో పదేళ్ల పాటు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు తాను ఐదో సారి ముఖ్యమంత్రిగా వస్తానంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అంతేకాదు, రాష్ట్రంలో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందని అన్నారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఓకే పార్టీ పాలన సాగిస్తోందని, దాని వల్ల రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. అదే మాదిరిగా ఏపీలో కూడా సుదీర్ఘ కాలం ఒకే పార్టీ అధికారం చేపడితే రాష్ట్రం డెవలప్ అవుతుందని అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతున్నామని చంద్రబాబు చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ పై చర్చించిన చంద్రబాబు వెల్తీ.. హెల్తీ…హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో దీనిని రూపొందించామని అన్నారు. స్వర్ణాంధ్ర-2047 నినాదంతో ముందుకు వెళ్లాలని, నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలకు సేవ చేస్తే ఏ ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారని చంద్రబాబు అన్నారు.
డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హైస్పీడ్‌లో రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని చెప్పారు. ఎన్జీవో, ఆలిండియా సర్వీసెస్ భవనాలు 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు. 6 నెలల వ్యవధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు.
టీమ్ లీడర్‌గా ముందుండి పని చేస్తానని.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు తనతో కలిసి పని చేయాలని, స్పీడు పెంచాలని పిలుపునిచ్చారు. అమరావతి పూర్తయి ఉంటే ఇప్పటికి ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు వచ్చేవని చెప్పారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో విలువైన సమయాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.