ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో మొట్టికాయలు ఎదురయ్యాయి. `రాజకీయ ప్రతీకార చర్యలను` కోర్టుకు తీసుకువస్తారా? అంటూ.. న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. టీడీపీపరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును అరెస్టు చేయాలని బావించిన ఏపీ పోలీసులకు ఎదురు దెబ్బతగిలింది. ఒకకీలక కేసులో ఏలూరిని అరెస్టు చేయాలని భావించిన ఆలోచనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని మైనింగ్ కార్యక్రమాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
అయితే.. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవేనని చెబుతూ.. ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించని పోలీసు అధికారులను అరెస్ట్ చేయించడానికి వెనకాడబోమని ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది.
ఇలాంటి కేసుల్లో సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సాంబశివ రావును అరెస్ట్ చేస్తే బాధ్యులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యనించింది.
ఈ క్రమంలో వివరాలు అందించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఉమ్మడి ప్రకాశంలోని పరుచూరులో నకిలీ ఓట్లు నమోదు చేశారని వీటిని తొలగించాలని కోరుతూ ఫాం 7 దాఖలు చేశారు ఏలూరి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు 12 వేల ఓట్లను తొలగించారు. ఇక, అప్పటి నుంచిరాజకీయంగా ఈ నియోజకవర్గం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంఅయింది.