ప్రపంచంలోని కొన్ని దేశాలు చిన్నవైనప్పటికీ విపరీతంగా పాపులర్ అవుతుంటాయి. అటువంటి దేశాల్లో దక్షిణ అమెరికాలోని వెనిజులా ఒకటి. సరిగ్గా 2016లో భారత్ లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరుణంలోనే వెనిజులాలోనూ నోట్ల రద్దు జరిగింది. అయితే, కొత్త నోట్లు సరైన సమయానికి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. దీంతో, ఆ దేశం పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. తాజాగా కొత్త నోటు ప్రవేశపెట్టడంతో ఆ దేశం పేరు మరోసారి వార్తల్లోకెక్కింది.
వెనిజులాలో బొలివర్ లో కరెన్సీ ఉంటుంది. కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 10 లక్షల విలువైన బొలివర్ నోటును వెనిజులా ప్రభుత్వం విడుదల చేసింది. అయినా, దేశ ఆర్థిక పరిస్థితి మారుతుందన్న నమ్మకం లేదంటోన్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే, వెనిజులాలో 1 మిలియన్ బొలివర్ నోటు విలువ భారత కరెన్సీలో 39 రూపాయలే కావడం విశేషం.
90వ దశకానికి ముందు సంపన్న దేశంగా ఓ వెలుగు వెలిగిన వెనిజులా….ప్రస్తుతం తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు చమురు, బంగారం నిక్షేపాలతో సంపన్నదేశంగా విరాజిల్లిన ఆ చిన్న దేశం…హ్యూగో చావెజ్ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పతనం దిశగా అడుగులు వేసింది. చమురు, బంగారం నిల్వలున్నాయన్న ధీమాతో ఎడాపెడా అప్పులు చేసి ప్రజలకు దాదాపుగా అన్నీ ఉచితంగా పంచిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉచిత పథకాల కోసం ప్రపంచ దేశాల నుంచి అందినకాడికి అప్పులు చేసింది. తీరా, అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడంతో పాలకులు చేతులెత్తేశారు.
చివరకు, నష్టనివారణ కోసమంటూ పిల్లలాడుకునే నోట్లు ముద్రించినట్టు ఆ దేశంలో కరెన్సీ నోట్లు ముద్రించారు. దీంతో, సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమై ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అదే సమయంలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో కనీసం కూరగాయలు కొనేందుకు కూడా సంచుల కొద్దీ డబ్బును జనాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వెనిజులా సర్కారు ఏకంగా 10 లక్షల బొలివర్ల విలువతో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించింది.
అయితే, వెనిజులా తరహాలోనే ఏపీలోనూ చాలా ఉచిత పథకాలు అమలవుతున్న నేపథ్యంలో ఏపీని సోషల్ మీడియాలో కాబోయే వెనిజులా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అధికారం కోసం అతి త్వరలోనే ఏపీని జగన్ మరో వెనిజులా చేస్తారేమోనని సెటైర్లు వేస్తున్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడంలో తప్పులేదని, కానీ, ఓటు బ్యాంకు కోసం విచ్చలవిడిగా ఉచిత పథకాలు పెట్టడం వల్ల వెనిజులా తరహాలోనే ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటే అవకాశముందని కామెంట్లు చేస్తున్నారు.
జగన్ కూడా తన ఉచిత పథకాల కోసం ఇటు ప్రజలపై పన్నులు వేస్తూ నడ్డి విరుస్తుండడంతోపాటు, అందినకాడికి అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై , భావి తరాలపై భారం వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే త్వరలోనే వెనిజులా తరహాలో ఏపీలో కూడా జనం కిలో టమాటాలు కొనేందుకు కిలో నోట్లు పెట్టాల్సి వస్తుందేమోనని వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
మరి, వెనిజులా వంటి దేశాల చేదు అనుభవాలను జగన్ గుర్తించి…అప్పులు చేయడానికి బదులు ఏపీకి పెట్టుబడులు తెచ్చి ఆదాయం పెంచుకునే మార్గాలు చూడాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. అయినా, మన పిచ్చిగానీ…ఆర్థిక నేరాల్లో, క్విడ్ ప్రోకోలో, షెల్ కంపెనీ వ్యాపారాల్లో ఆరితేరిన జగన్ కు ఇవన్నీ పట్టవంటూ చమత్కరిస్తున్నారు నెటిజన్లు.