దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 4లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మే15నాటికి భారత్ లో కరోనా విశ్వరూపం చూపుతుందని, రోజుకు సగటున 5 లక్షల కేసుల వరకు నమోదయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, దేశంలో ఆక్సిజన్ తో పాటు కరోనా చికిత్సలో కీలకమైన రెమ్ డెసివిర్ కొరత కలవరపెడుతోంది.
దీంతో, రోజువారీ మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. భారత్ లో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు పలు దేశాలు మెడికల్ ఆక్సిజన్ తో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనూ పంపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా చికిత్సకు సంజీవని వంటి ఔషధాన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించింది. ‘2 డీఆక్సీ డి గ్లూకోజ్’ (2-డీజీ) అని పిలిచే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.
డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. కరోనా చికిత్సలో ఈ ఔషధం ఎంతో కీలకం కానుందని పరిశోధకులు చెబుతున్నారు. 2-డీజీ వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమైందని వారు వెల్లడించారు.
2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని గుర్తించామని చెప్పారు. 2-డీజీతో చికిత్స పొందిన కరోనా రోగులకు కొద్ది రోజుల్లోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. కరోనా వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని స్పష్టం చేసింది. కరోనా పాలిట 5జీ వంటి ఈ 2-డీజీ ఔషధాన్ని త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.