“సీఎం కొడుకు సీఎం అవ్వాలని రాజ్యాంగంలో రాశారా?“
“వైసీపీకి అధికారం ఇస్తే.. లక్షల కోట్లు కాదు.. ప్రజల ఆస్తులను కూడా దోచుకుంటారు!“
“అధికారంలోకి వస్తే.. వైసీపీ నేతలు జిల్లాలనే కాదు.. మండలాలను కూడా పంచేసుకుంటారు“
– ఇవీ.. 2019 ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్, ఆపార్టీ నేతలపై పేల్చిన పొలిటికల్ పంచ్‌లు.
మరి ఈ రెండేళ్లలో ఆయన ఏం చేశారు? జగన్ పాలనపై ఇంటా బయటా కూడా తీవ్ర విమర్శలు.. హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి మొట్టికాయలు పడుతున్నా.. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని.. ప్రతిపక్షాలు లబోదిబోమంటున్నా పవన్ ఏమయ్యారు? ఎక్కడున్నారు?
ఇదీ.. ఇప్పుడు ప్రజల్లోనూ రాజకీయ నేతల్లోనూ చర్చకు వస్తున్న అంశాలు. ఏపీలో జగన్ రెండేళ్లపాలన పూర్తయింది. ఈ క్రమంలో గతంలో పవన్ చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతానంటూ.. పవన్ తీవ్రంగా స్పందించారు.
ప్రజల కోసం రోడ్డెక్కుతానని చెప్పారు. అయితే.. ఈ రెండేళ్ల కాలంలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలపై ప్రజలు ఉద్యమించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని, ఇసుక కుంభకోణం, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, ప్రతిపక్ష నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేసి.. అరెస్టు చేయడం.. జైళ్లకు తరలించడం.. వంటి అనేక నిర్ణయాలు… తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
జగన్ తీసుకున్న వందకు పైగా నిర్ణయాలను కోర్టులు తోసిపుచ్చాయి. ప్రతిపక్ష నేతలపై కుట్ర పూరిత కేసులు నమోదవుతున్నాయని, అసలు రూల్ ఆఫ్లా అమలవుతోందా? అని హైకోర్టు వ్యాఖ్యలు సంధిం చింది. మరి జగన్ పాలన ఇలా ఉన్నప్పటికీ.. పవన్ ప్రశ్నించలేకపోవడం..పై పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్ అంటే.. పవన్ భయపడుతున్నారా? లేక.. బీజేపీ తో పొత్తు ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనల మేరకు ఆయన మౌనవ్రతం చేస్తున్నా రా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ఇక, ఈ విషయంలో పవన్ వెర్షన్ చూస్తే.. గత ఏడాది ఆయన కరోనా ఫస్ట్ వేవ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఇక కొన్నాళ్లకు ఏపీలో అడుగు పెట్టినా..కేవలం మంత్రి కొడాలి నానిని మాత్రమే టార్గెట్ చేసుకుని గుడివాడలో సభ పెట్టారు. వకీల్ సాబ్ చెప్పాడని మీ సీఎం కు చెప్పండి.. అంటూ.. వ్యాఖ్యలు చేసినా.. అవి పవన్ స్థాయిని దాటలేదనే గుసగుస వినిపించింది.
ఇక, ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కే వెళ్లిపోయారు. ఇప్పుడు సెకండ్ వేవ్ పేరుతో ఆయన మళ్లీ మౌనం పాటిస్తున్నారు. ఇలా.. మొత్తానికి జగన్ పై ఎన్నికల సమయంలో దూకుడుగా వ్యవహరించిన పవన్.. ఇప్పుడు మౌనం పాటించడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.