ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ నుంచి వరుసగా ఐదో సారి వైసీపీ తరఫున కొడాలి నాని(శ్రీవెంకటేశ్వరరావు) పోటీ చేస్తున్నారు. ఇక, ఇక్కడ నుంచిటీడీపీ తరఫున ఎన్నారై వెనిగండ్ల రాము పోటీకి దిగారు. ఈ క్రమంలో తాజాగా కొడాలి నాని మాట్లడుతూ.. గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదోసారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు.
“ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారు“ అని నాని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతు న్నారని విమర్శించారు. తనను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్ లకు సవాల్ విసురుతున్నానని… దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని అన్నారు. చంద్రబాబు 420 అనే విషయం గుడివాడ, చంద్రగిరి, పామర్రు ప్రజలకు తెలుసని చెప్పారు.
తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు తనను ఓడించలేరని అన్నారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీనే అని.. గుడివాడలో మళ్లీ గెలిచేది తానే అని చెప్పారు. కాగా, నాని ఇప్పటి వరకు 4 సార్లుగా ఇక్కడ విజయం దక్కించుకున్నారు. వీటిలో రెండు సార్లు 2004, 2009లో టీడీపీ తరఫునే ఆయన విజయం దక్కించుకున్నారు. 2014, 2019లో మాత్రం వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది.
ఇక్కడ పార్టీలకన్నా వ్యక్తిగా నాని బలం ఎక్కువగానే ఉంది. అందుకే టీడీపీ ఇక్కడ అభ్యర్థులను మారుస్తున్నా.. విజయం అందుకోలేక పోతోందనే వాదన ఉంది. అయితే..ఈ దఫా ఎన్నారై నాయకుడు, ఆర్థికంగా బలంగా ఉన్న రామును చంద్రబాబు బరిలో నిలిపారు. దీంతో నానికి .. గెలుపు కష్టమైంది. ఈసారి నానిని వదిలించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు.