అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సంప్రదాయానికే ఓటేశారు పార్టీ చీఫ్ కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు.. ఎవరైనా ప్రజాప్రతినిధి అనుకోని రీతిలో కాలం చేస్తే.. ఆ సందర్భంగా వచ్చే ఉప ఎన్నికల్లో మరణించిన నేత కుటుంబానికి చెందిన వారు బరిలోకి దిగితే.. వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా రాజకీయ పార్టీలు వ్యవహరించేవి. ఒకవేళ విపక్షానికి చెందిన వారు మరణించినా.. అధికారపక్షం పోటీకి దూరంగా ఉండేది.
విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇలాంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టేశాయి రాజకీయ పార్టీలు. ఇక.. దుబ్బాక ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించటం.. ఆ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సోలిపేట సతీమణికి సీటు ఇస్తారా? వేరే వారికి ఇస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. అలాంటి ప్రచారానికి చెక్ చెబుతూ.. తాజాగా పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేశారు కేసీఆర్.
దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన చూస్తే.. కేసీఆర్ వ్యూహం ఇట్టే అర్థమైపోతుంది.తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన సోలిపేట.. పార్టీ కోసం అంకితభావంతో పని చేశారు. తన తుదిశ్వాస విడిచే వరకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది కోసం కష్టపడి పని చేశారు. ఆయన కుటుంబం మొత్తం అటు ఉద్యమం.. ఇటు నియోజకవర్గ డెవలప్ మెంట్ లో పాలు పంచుకుంది.
అందుకే.. ఆ కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధానికి గుర్తుగా అభ్యర్థిగా సుజాతను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ డెవలప్ మెంట్ తో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా జరిగేందుకు వీలుగా సోలిపేట కుటుంబానికి అధికారాన్ని అప్పజెప్పటం సరైనదని కేసీఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికను సెంటిమెంట్ ఫైట్ గా మార్చేలా గులాబీ బాస్ నిర్ణయం ఉందని చెప్పాలి.
ఇక.. సుజాత వివరాల్లోకి వెళితే ఆమె 1969లో జన్మించారు. 1986లో రామలింగారెడ్డిని పెళ్లాడారు. నాలుగో తరగతి వరకు చదివిన ఆమెకు ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు. ఆమె స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్. మరి.. దుబ్బాక ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.