నోటి నుంచి వచ్చే మాటలకు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉండటం ఇప్పుడు ఆగ్రహాం వ్యక్తమవుతోంది. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులు ఉండాలని.. అందులో పాలనా రాజధాని గా గుర్తించిన విశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది జగన్ సర్కారు. అధికారంలో ఉన్న వారు తమకంటూ ఏర్పాటు చేసుకున్న విధానాల్ని అనుసరిస్తారన్న మాట చెప్పొచ్చు కానీ.. 2019 ఎన్నికల వేళలోనూ తాము అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అంటూ బల్లగుద్ది చెప్పిన జగన్.. తీరా పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చేయటంతోనే అసలు ఇబ్బంది అంతా.
రాజధానిగా గుర్తించిన అమరావతిలోని ఆర్ 5 జోన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సెంటు చొప్పున భూమిని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సీఎం జగన్ నుంచి ఆయన ప్రభుత్వంలోని వారు.. పేదలకు పట్టాలు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండకూడదా? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే.. ఇక్కడ పాయింట్ ఏమంటే.. జగన్ మాటల ప్రకారం పాలనా రాజధాని విశాఖపట్నం అయినప్పడు.. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యమైనప్పుడు.. పాలనా రాజధాని విశాఖలో పెద్ద ఎత్తున సెంటు స్థలాన్ని ఇవ్వొచ్చు కదా? అందుకు భిన్నంగా అమరావతిని రాజధానిగా గుర్తించే ఆలోచన లేనప్పుడు.. అందులో భూముల్ని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.
అంటే.. విశాఖ పాలనా రాజధాని అని జగన్ చెప్పినా.. ఆయన మనసులో అమరావతిని రాజధానిగానే భావిస్తున్నారా? తన ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో చేసిన డెవలప్ మెంట్ కు భిన్నంగా.. మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న అంశాలను పట్టించుకోకుండా.. పేదల ఇళ్ల కోసం ఎందుకంత హడావుడి పడుతున్నారు? అన్నది ప్రశ్న.
మరో కీలక అంశం ఏమంటే.. పేదలు ఇళ్లు కట్టుకోవటానికి వీలుగా సెంటు భూమిని ఇవ్వాలన్నదే జగన్ లక్ష్యమైనప్పుడు.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల్ని సిద్ధం చేసి ఇవ్వాలి కదా? అదేమీ లేకుండా.. సెంటు చొప్పున భూమిని ఇచ్చుకుంటూ పోతే.. రానున్న రోజుల్లో సివిల్ పంచాయితీలతో ఆ ప్రాంతం ఆగమాగం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయినా.. రాజధాని అమరావతి కానప్పుడు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఉండాలన్న జగన్ కలను నిజం చేసుకోవటానికి విశాఖలో పంపిణీ చేయాల్సిన భూమిని రాజధాని కాని అమరావతిలో చేయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మరి.. దీనికి సమాధానం చెప్పే వారెవరు?