నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఈకలు పీకినట్లుగా తెంపరితనంతో పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇష్యూ ఏదైనా సరే.. తమదైన వాదనను వినిపించటం.. అవసరమైన లాజిక్కుల్ని తెర మీదకు తీసుకొచ్చి.. మనోడు చెబుతున్నదినిజమే కదా? అన్న భావన కలిగేలా చేస్తున్నారు. అయితే..తర్కంతో అలాంటి వారి మాటలు విన్నప్పుడు డొల్లతనం బయటకు రావటమే కాదు.. ఎంతలో ఎంతలా మాట్లాడారన్న భావన కలగటం ఖాయం.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఈ సందర్భంలో ఏపీ సర్కారు ఏమీ చేయలేకపోతున్న విమర్శ జగన్ ప్రభుత్వం మీద పెరుగుతోంది. దీంతో.. ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి విశాఖ ఉక్కు మీద సరికొత్త వాదనను తెర మీదకు తీస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఎప్పుడో మొదలైందని.. తమ తప్పేం లేదన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల్ని ఉపసంహరిస్తూ 2017లో అప్పటి ఆర్థిమంత్రిఅరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారని.. ఆ సమయంలో బాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం చేస్తే. ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. అప్పట్లో అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారన్నారు. జగన్ పార్టీ నేతలు చెప్పిన మాటలన్ని నిజాలే అనుకుందాం? మరి.. బాబు చేస్తున్న తప్పుల్ని హైలెట్ చేస్తూ వైసీపీ అప్పట్లో ఎందుకు ఉద్యమాన్ని చేపట్టలేదు? బాబు సర్కారు చేస్తున్న దుర్మార్గంపై ఎందుకు గళం విప్పలేదు?
తప్పు చేసే వాడిని ఎంత తప్పో.. తప్పు జరుగుతున్న విషయం తెలిసి కూడా కామ్ గా ఉండటం దేనికి నిదర్శనం? పోనీ అధికారంలోకి వచ్చాక విషయం బయటకు పొక్కకుండా ఎందుకు దాచిపెట్టారు? రాజధానినే మార్చే అంత పెద్ద ఆలోచన చేసినపుడు, ఈ ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రాసెస్ ను ఎందుకు కొనసాగించినట్లు? ఇవాల్టి రోజున బాబు తీరును ప్రశ్నిస్తున్న జగన్ పార్టీ నేతలు.. ఆ సమయంలో తామేం చేశామన్న విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. ముఖ్యమంత్రిజగన్ సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి..ఆ పని చేస్తారా?