అమిత్ షా సహా కేంద్రంలో మంత్రులను కలవడానికి రెండు రోజుల దిల్లీ పర్యటన పెట్టుకున్న కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. అమిత్ షా అపాయింట్మెంట్ దొరికినా ఆయనతో భేటీ మాత్రం జరగలేదు. దీంతో నిష్ఫలంగానే కేటీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తున్నారు.
అయితే.. కేటీఆర్‌తో అమిత్ షా భేటీ కాకపోవడానికి హోం మంత్రి కార్యాలయం చెప్తున్న కారణాలు నిజమేనా.. లేకుంటే కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు, అవమానించేందుకే అమిత్ షా అలా చేశారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కారణమేదైనా కేటీఆర్ మాత్రం అమిత్ షాను కలవకుండానే తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు.
దిల్లీ వచ్చిన కేటీఆర్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అర్బన్ డెవలప్మెంట్ మినిష్టర్ హర్దీప్ పురి, సివిల్ సప్లయ్స్ మినిస్టర్ పీయుష్ గోయల్‌లతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై వారితో మాట్లాడి తాను కోరాల్సింది కోరారు. ఆ తరువాత శనివారం రాత్రి అమిత్ షాను ఆయన కలవాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో అది రద్దయింది.
అమిత్ షా వరుస సమావేశాలలో ఉండడంతో కేటీఆర్‌తో మాట్లాడేందుకు సమయం లేకపోయిందని, శనివారం కలవడం సాధ్యం కాదని అమిత్ షా ఆఫీసు నుంచి కేటీఆర్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఆదివారం ఉదయం ఆయన తిరిగి తెలంగాణకు బయలుదేరారు.
మణిపుర్లో ఘర్షణల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఆ తరువాత తెలంగాణ బీజేపీ నేతల పంచాయితీ కూడా చేశారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండడంతో వారిద్దరితో అమిత్ షా మాట్లాడారు.
పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల, కోమటిరెడ్డిలతో అమిత్ షా మాట్లాడారు. ఇది అనుకున్న కంటే ఎక్కువ సేపు సుదీర్ఘంగా సాగడంతో కేటీఆర్‌ను కలిసేందుకు అమిత్ షాకు సమయం లేకపోయిందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే… ఆదివారం తెలంగాణలోని నాగర్ కర్నూలులో జేపీ నడ్డా బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో దానికి ఒక రోజు ముందు కేటీఆర్ అమిత్ షాను కలిస్తే అది వేరే సంకేతాలను పంపుతుందని.. నిన్నమొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్‌ను అమిత్ షా ఇప్పుడు కలవడం సరికాదని తెలంగాణ బీజేపీ నేతల నుంచి అభిప్రాయం రావడం వల్ల కూడా అమిత్ షా తన నిర్ణయం మార్చుకున్నట్లు చెప్తున్నారు.