వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ లో నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగిన కీలక నేత విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఇక రాజకీయాల్లోకి రానని.. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి మొన్నటి వరకు రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగానే కాకుండా ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు.
ఆయన పార్టీని వీటడంతో ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త పదవి కోసం వైసీపీలో విపరీతమైన పోటీ ఏర్పడింది. హేమాహేమీలు ఆ పదవిని దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ పోస్ట్ ను జగన్ ఎవరితో భర్తీ చేయనున్నారు? ఆయన ఓటు ఎవరికి? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాణ పేరు ప్రముఖంగా వినిపిచింది. ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న బొత్సను వైసీపీ సమన్వయకర్తగా నియమించబోతున్నారని టాక్ వినిపించింది.
కానీ ఇప్పటికే ఆయన ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమస్యలు వస్తాయని జగన్ భావిస్తున్నారట. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ పేర్ని నాని పేరు తెరపైకి వచ్చింది. వైసీపీకి అత్యంత విధేయులు మరియు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సాయిరెడ్డి ప్లేస్ ను పేర్ని నానితో రీప్లేస్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు. తద్వారా అక్కడ పార్టీకి సంబంధించిన అంశాలపై, ప్రభుత్వంపై గళమెత్తే ఒక వాయిస్ దొరుకుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలు నానితో చర్చలు కూడా జరిపారని టాక్ నడుస్తోంది. కాగా, వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన పేర్ని నాని గత ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న ఆయన.. కొద్ది రోజుల క్రితం రేషన్ రైస్ స్కామ్ లో అడ్డంగా ఇరుక్కుని సతమతమవుతున్నారు. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ కో-ఆర్డినేటర్ బాధ్యతలు పేర్ని నానికి అధిష్టానం అప్పగిస్తే.. ఆయన పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.