ఔను! ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్తే.. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్న కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఎంపీ రఘురామరాజు.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. కోర్టులో కేసు వేసిన తర్వాత.. ఈ ప్రశ్న మరింత జోరందుకుంది.
ముఖ్యమంత్రిగా జగన్ కీలక స్థాయిలో ఉన్నారని.. గతంలో ఆయన అక్రమాస్తులకు చెందిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం కూడా గడిపిన కొందరికి.. ఆయన కీలకపదవులు అప్పగించారని.. రఘురామ సాక్ష్యాలతో సహా కోర్టుకు వెళ్లారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ విషయంలో సీబీఐ కూడా కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ బెయిల్ రద్దు అంశం హాట్ టాపిక్‌గానే కాకుండా.. ఇప్పటి వరకు ఉన్న న్యాయనిపుణుల అంచనాల మేరకు 90 శాతం వరకు రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలు కావడం.. పన్నీర్ సెల్వంను మధ్యంతర ముఖ్యమంత్రిగా నియమించడం తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు జగన్ కూడా జైలుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? సీఎం జగన్ ఆలోచన ఎలా ఉంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు జగన్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు.. తన మాతృమూర్తి.. విజయమ్మను తదుపరి ముఖ్యమంత్రిని చేయడం. రెండు తన సతీమణి భారతిని సీఎం స్థానంలో కూర్చోబెట్టడం. అయితే.. ఈ రెండిటిలోనూ జగన్ మొగ్గు సతీమణి వైపే ఎక్కువగా ఉంది.
ఎందుకంటే.. తన మాతృమూర్తే అయినప్పటికీ.. సీఎం స్థానంలో ఆవిడ కనుక కూర్చుంటే.. సోదరి షర్మిల తరఫున రాజకీయం పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేసమయంలో వైవీ సుబ్బారెడ్డి సహా మరికొందరు బంధువుల ప్రమేయం పాలనలో కనిపించడంతోపాటు.. పార్టీపైనా ప్రభావం పడుతుంది.
అంతేకాదు.. విజయమ్మ మెతకవైఖరి.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయం. అదేసమయంలో అధికార కేంద్రాలు కూడా పెరిగిపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే సతీమణి వైపు జగన్ మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ .. సొంత మీడియా.
తాను రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత.. సాక్షి మీడియా సంస్థలను పాలించేందుకు ఒకరిద్దరు సొంత బంధువులు ముందుకు వచ్చారు. కానీ, వారికి అవకాశం ఇవ్వకుండా.. తన సతీమణికే పగ్గాలు అప్పగించారు జగన్. దీంతో మీడియా ఒడిదుడుకులు ఎదురైనా.. ఆమె నెట్టుకువచ్చారు.
ఇప్పుడు కూడా ఏపీ సీఎం పదవిని తన సతీమణికి అప్పగించడం ద్వారా.. ఇటు పాలన పరంగా.. అటు పార్టీ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తవని జగన్ భావిస్తున్నారు. తాను జైలు నుంచి మానిటరింగ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహిత వర్గాలే చూచాయగా చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.