వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్‌బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. అధికా రంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నోరు చేసుకున్నారు. అప్పటి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటికి ఎంత వస్తే అంత అనేశారు. అంతేకాదు.. తీవ్రపదాలతో దుర్భాషలాడారు. మరి అలాంటి నాయకుడిని సర్కారు ఎలా వదిలేస్తుంది? కచ్చితంగా కేసు పెట్టి జైలుకు పంపిస్తుందనే అనుకుంటారు.
దీనికి ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు వెతకాల్సిన అవసరం కూడా లేదు. గుడివాడలో వరుసగా జరిగిన కేసినో వ్యవహారం చాలు. చేతికి మట్టి అంటకుండానే కొడాలిని జైలుకు పంపించేయొచ్చు. కానీ, కూటమి పార్టీ వచ్చి రెండు నెలలు గడిచిపోయినా.. ఇప్పటి వరకు కొడాలిపై చర్యలు తీసుకోలేదు. కనీసం.. ఆయనపై కేసు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగడం లేదు. అసలు ఆయన ఊసు కూడా మరిచిపోయినట్టుగా ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తి కర విషయం.
అంతేకాదు.. రెడ్ బుక్‌లో ఖచ్చితంగా కొడాలి పేరు కూడా ఉంటుందనే అంచనా ఉంది. ఇప్పటికే జోగి ర మేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలోనూ చాలా మంది నాయకులపై కేసులు నమోదయ్యాయి. అలాంటిది అత్యంత వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. కాబట్టి ఖచ్చితంగా కొడాలిపై కేసు పెట్టి.. జైలుకు పంపిస్తారని.. పంపించాలని కూడా తమ్ముళ్లు కోరుకున్నారు.కానీ, ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
దీనికి కారణం.. జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ టీడీపీలో వెలుగు చూసింది. జూనియర్‌తో కొడాలికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. సో.. ఆయనే ఇప్పుడు కొడాలిని కాపాడుతున్నారనేది తమ్ముళ్లు చెబుతున్న మాట. తను నేరుగా కాకపోయినా.. నారా లోకేష్‌కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు దర్శకుల ద్వారా.. జూనియర్.. ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని.. అందుకే ఎన్ని రోజులైనా కొడాలి గురించి కానీ.. ఆయనపై కేసుల గురించి కానీ.. పార్టీలో చర్చ లేకపోవడం గమనార్హం అంటున్నారు.
అయితే ఇది నిజం కాదని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. సరైన ఆధారాలు, సరైన సమయం కోసం లోకేష్ ఎదురుచూస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న మాట. గతంలో బాబును లోకేష్ ను తిడుతుంటే కంట్రోల్ చేయని ఎన్టీఆర్… ఇపుడు ఏ మొహం పెట్టుకుని అతని తరఫున వకాల్తా పుచ్చుకుంటారు? కాబట్టి కచ్చితంగా ఇందులో ఎన్టీఆర్ జోక్యం చేసుకోరని విశ్లేషకులు అంటున్నారు.