సుబ్రమణ్య స్వామి.. ఒక మీడియా సంస్థ మీద గురి పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడెప్పుడో టీటీడీ ప్రతిష్ఠ మసకబారేలా కథనాల్ని అచ్చేసిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద అక్షరాల రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా వేయనున్నట్లుగా ఆయన చెప్పిన మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతకుమించిన ట్విస్టు… ఆంధ్రజ్యోతిపై కేసు వేయడానికి సుబ్రమణ్య స్వామి స్పెషల్ ఫ్లైటు వేసుకుని వచ్చి జగన్ ని కలిశాడు. ఫ్లైటు డబ్బులు ఎవరు పెట్టారు అన్నది మరో చర్చ.
ఇక.. తాను ఏ కేసు వేసినా దాని చివరి వరకు వెళతానని.. ఆంధ్రజ్యోతికి అన్యాపదేశంగా తన సీన్ ఎంతన్న విషయాన్నిగుర్తుచేసే ప్రయత్నం చేశారు స్వామి. సాధారణంగా వేరే పత్రికలు అయితే ఇలాంటి వార్తల్ని కాస్త తక్కువ ప్రాధాన్యత ఇవ్వటమో లేదంటే..అసలు లైట్ తీసుకోవటమో చేస్తారు. కానీ.. ఆంధ్రజ్యోతి అందుకు భిన్నం కదా. సుబ్రమణ్య స్వామి మాటల్ని కవర్ చేస్తూనే.. ఆయన ఏపీ టూర్ డిటైల్స్ ను పబ్లిష్ చేసి కొత్త చర్చకు తెరతీసింది.
తమ మీడియా సంస్థలో అచ్చేసిన 16నెలల తర్వాత రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారని.. అందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. అదే ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొన్న ఆయన.. టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లుగా వెల్లడించారు.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్వామి.. తాను జగన్ తో కలిసి వేడి వేడి అన్నం తిన్నట్లు చెప్పారు. అదే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేటకు వచ్చిన ఆయన.. ఎయిర్ పోర్టులోనే ఉండిపోయి అనంతరం అదే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఫ్యూయల్ నింపుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పురపాలిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో కోర్టుకు సెలవు అయినప్పటికీ సంతకాల లాంఛనాల్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి.. కోర్టు బయటే సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి వెనక్కి వెళ్లినట్లుగా పేర్కొంది.
ఇంతకీ రూ.100 కోట్ల పరువు నష్టం దావాకు కారణమైన కథనం ఏమిటన్నవిషయం మీదా ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది. అప్పట్లో టీటీడీ క్యాలెండర్.. పంచాంగం.. పీడీఎఫ్ ఫైళ్ల కోసం గూగుల్ సెర్చ్ చేస్తే భక్తులకు.. శ్రీయేసయ్య అనే పదాలు కనిపించాయి. దీనిపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు.. నేతలు తిరుపతిలో ఆందోళన చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంకన్న వెబ్ సైట్ లోకి యేసయ్యయ అనే శీర్షికన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది.
ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తాము పేర్కొంటే.. తాజాగా స్వామి మాత్రం..టీటీడీ వెబ్ సైట్ లో జీసస్ బోధనలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని.. అందుకే రూ.100 కోట్లకు సివిల్ దావా వేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మరీ.. ఇష్యూ రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.