అందరూ ఊహించినట్లే జరుగుతోంది. విశాఖ సదస్సు ద్వారా లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామిక సంస్థలతోపాటు వందల కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయని, గత మార్చి నెలలో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వేదికగా ఈ మేరకు ఒప్పందాలు చేసుకున్నట్లు జగన్ సగర్వంగా ప్రకటించారు. ఆ సదస్సు ముగిసి ఇప్పటికి ఆరు నెలలు దాటినా రాష్ట్రంలో పెట్టుబడుల జాడే లేదు. ఆ సదస్సుకు ముందే రూ. 3,845 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొల్పిన 14 పరిశ్రమలను అదే సదస్సు వేదికపై నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
ఆ తర్వాత కొత్తగా కుదుర్చుకున్న ఎంవోయూల కార్యాచరణ దిశగా రెండో అడుగు పడలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలు దాదాపు శూన్యమే. పైగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన అనేక పరిశ్రమలు, కంపెనీలు జగన్ అండ్ కో దెబ్బకు గిలగిలా కొట్టుకుని రాష్ట్రం దాటిపోయాయి. లులూ వంటి అనేక బహుళజాతి కంపెనీలు మళ్లీ ఇటు రాబోమని తెగేసి చెప్పి మరీ తరలిపోయాయి. ఇక చంద్రబాబు హయాంలో ఉర్రూతలూగిన ఐటీ రంగం కుప్పకూలిపోయింది. ఐటీ, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం హీనస్థితికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు వేదికగా వెల్లడించింది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలను నిలిపివేసిన జగన్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఘోరంగా విఫలమైంది.
ఈ నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి ఈ నాలుగేళ్లలోనే బాగా కుంటుబడిపోయింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువత, కార్మికులు, సామాన్యులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలు, విపక్షాల నుంచి విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో.. తాము కూడా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకునేందుకు జగన్ ప్రభుత్వం హడావుడిగా గత మార్చిలో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించింది. రాష్ట్రంలో ఇప్పటికే నడుపుతున్న పరిశ్రమల విస్తరణ పేరుతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, వందల కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయి లేని మరికొన్ని కంపెనీలు, ఊరూ పేరూ లేని అనేక ఉత్తుత్తి కంపెనీలతోపాటు చివరకు యూట్యూబ్ చానళ్లు, టీవీ యాంకర్లతో కూడా జగన్ సర్కారు ఎంవోయూలు చేసుకోవడం విచిత్రం.
ఆయా కంపెనీలు చేసుకున్న ఒప్పందాలలో పేర్కొన్న పెట్టుబడుల గణాంకాలను చూసి రాష్ట్ర ప్రజలే కాదు.. ఆర్థిక నిపుణులు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఉదాహరణకు ఎన్టీపీసీ ఏకంగా రూ.2,35,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్లు, రెన్యూ పవర్ రూ. 97,550 కోట్లు, ఇండోసోల్ రూ. 76,033 కోట్లు, ఏసీఎంఈ రూ. 68,976 కోట్లు, టీసీపీఎస్వోఎల్ రూ. 65,000 కోట్లు, జేఎస్‌డబ్ల్యు రూ. 50,632 కోట్లు, హంచ్ వెంచర్స్ రూ. 50,000 కోట్లు, గ్రీన్కో 47,600 కోట్లు, ఓసీఐవోఆర్ రూ. 40,000 కోట్లు హీరో ఫ్యూచర్స్ సంస్థ రూ. 30,000 కోట్లు చొప్పున రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇంకా వైజాగ్ టెక్‌పార్క్, అదానీ ఎనర్జీ గ్రూప్, ఎకోరెన్ ఎనర్జీ, సెరంటికా, ఎన్‌హెచ్‌పీసీ, అరబిందో గ్రూప్, ఓటూ పవర్, ఏజీపీ సిటీ గ్యాస్ తదితర కంపెనీలు రూ.10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని.. రూ.5,000 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని వందల కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. వీటిలో ఏ ఒక్క ఒప్పందం కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అదానీ, అరబిందో, గ్రీన్కో, షిర్డీసాయి ఎలకి్ట్రకల్స్ తదితర సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు చేసుకోగా.. జగన్ వచ్చిన తర్వాత మళ్లీ అదే సంస్థలతో దావోస్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు.
ఆ ఎంవోయూలు కార్యరూపం దాల్చకుండానే.. మళ్లీ అవే సంస్థలు రాష్ట్రంలో రూ. వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయంటూ గత మార్చి నెలలో విశాఖ సమిట్‌లో ఇంకోసారి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలను మాయ చేసి. మభ్యపెట్టి మళ్లీ వచ్చే ఏడాది ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులపై కట్టుకథలు చెబుతుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజముందని రూఢి అయింది.
ఎందుకొచ్చిన రిస్కు?
‘నవ్యాంధ్రలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి రిస్క్ లేదు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన దిగ్గజ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు వెంటవెంటనే కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటాం. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. పెట్టుబడిదారులకు సమస్యలు ఎదురైతే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటా’ అని ముఖ్యమంత్రి జగన్ విశాఖ సమిట్ వేదికపై నుంచే పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. కానీ అవన్నీ అబద్ధాలేనని వారిప్పుడు మండిపడుతున్నారు. ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలకు సింగిల్ విండో పోర్టల్ ద్వారా 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి, భూములను కేటాయిస్తామని హామీ ఇచ్చిన జగన్ సర్కారు.. ఇప్పుడు భూముల కేటాయింపు, అనుమతులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తోందని వాపోతున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొంటున్న రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఒప్పందాలు చేసుకున్న దాదాపు 50 పారిశ్రామిక సంస్థలకు ఇప్పటివరకు అనుమతులు, భూకేటాయింపులు పూర్తి కాలేదు. విశాఖ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ వెంటవెంటనే కార్యరూపం దాల్చేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు జగన్ ప్రకటించారు. ఆ కమిటీ వారం వారం సమావేశమై సమీక్షిస్తుందన్నారు. మరి ఈ ఆరు నెలలుగా అదేం చేస్తోందో తెలియడం లేదు. ఎందుకంటే ఎంవోయూలు కుదుర్చుకున్న చాలా పారిశ్రామిక సంస్థలు ముఖం చాటేయడమే కాదు.. ఏకంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరలిపోయాయి.