విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో వైసీపీ నేతలంతా ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు రాని ఆ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు నామినేటెడ్ పోస్టులు, పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఆశావహులందరికీ న్యాయం చేయడంలో జగన్ విఫలం కావడంతో విశాఖ వైసీపీలో అసమ్మతి రాజ్యమేలుతోందని టాక్ వచ్చింది.
దీంతో, విశాఖను అనధికారికంగా రూల్ చేస్తున్న విజయసాయిరెడ్డి పరిస్థితిని చక్కదిద్ది అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నించారట. ఆ బుజ్జగింపుల తర్వాత కూడా చాలామంది అసంతృప్త నేతలు ఇంకా అలకపాన్పు మీదే ఉన్నారట. దీంతో, చివరకు వైజాగ్ లో ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు పీకే టీంను జగన్ రంగంలోకి దింపారట.
రెండు రోజుల క్రితం వైజాగ్ వచ్చిన పీకే టీం…కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలతో మాటామంతీ జరుపుతున్నారట. స్థానికంగా వాస్తవ పరిస్థితులు ఏమిటో వారు అడిగి తెలుసుకుంటున్నారట. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని సేవ చేస్తున్నవారికి కనీసం నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదన్న ఆవేదన వారు వ్యక్తం చేశారట. కేవలం ఆర్థికంగా పార్టీకి అండగా ఉన్న వారికి మాత్రమే పదవులు దక్కాయని వారు వాపోయారట.
కొందరు ప్రజాప్రతినిధుల మాటలకే అధికారుల కూడా విలువిస్తున్నారని, వైసీపీలో చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులను కూడా అధికారులతో చేయించుకోలేకపోతున్నామని పలువు ఆవేదన వ్యక్తం చేశారట. ఇక, పీకే టీం ఇచ్చే నివేదిక ఆధారంగా విశాఖలో పార్టీ పరిస్థితి చక్కదిద్దాలని జగన్ అనుకుంటున్నారని తెలుస్తోంది.