ఈ మధ్యకాలంలో అభిమానం పేరుతో కొందరు హద్దులు దాటేస్తున్నారు. ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు రక్తాన్ని చిందించాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. నటుడిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగాడు.
సినిమా రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసినప్పటికీ పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే రెట్టింపు అయింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మరిన్ని విమర్శలు వెల్లువెత్తినా, ఓటమి వెక్కిరించినా జనసేన పార్టీని నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ ఏనాడు వెనకడుగు వేయలేదు. ఆయన కష్టానికి ప్రతిఫలం 2024 ఎన్నికల్లో లభించింది. ఏపీలో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి బలమైన రాజకీయ శక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రి బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో తన మార్క్ పాలనను చూపిస్తున్నారు.
అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవాలని, కుదిరితో ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు ఎంతలా కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆయనకున్న ప్రొటోకాల్, బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఫ్యాన్స్ ను మీట్ అవ్వడం అనేది ఇటీవల కాలంలో అసాధ్యంగా మారింది. అయినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పెద్ద సహాసమే చేశాడు.
పవన్ కళ్యాణ్ కు చిన్నతనం నుంచి హరిచరణ్ విరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సదరు యువకుడు.. ఎలాగైనా తన అభిమాన హీరోను కలవాలని అనుకున్నారు. అక్కడితో ఆగకుండా తన రక్తాన్ని చిందించి పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. రక్తంతో గీసిన చిత్రపటానికి పవన్ కు చూపించాలనుకున్నారు. రాజమండ్రి జైల్ రోడ్లో శుక్రవారం జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి పవన్ రావాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. దీంతో నిరుత్సాహానికి గురైన హరిచరణ్.. తన రక్తంతో గీసిన పవన్ చిత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ కావడంతో.. హరిచరణ్ అభిమానంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ఇంత వైల్డ్‌గా ఉన్నారేంట్రా.. రక్తంతో బొమ్మ గీయడమేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.