గెలవటంలో ఎంత మజా ఉంటుందో గెలిపించటంలో కూడా అంతే మజా ఉంటుంది. గోలు కొట్టిన తర్వాత ఆటగాళ్ళు ఎంతంగా సంబరాలు చేసుకుంటారో వాళ్ళ కోచ్ కూడా గ్రౌండ్ బయట అంతే హ్యాపీగా ఫీలవుతారు. ఇదంతా ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించే.
ఒకేసారి ఇటు తమిళనాడులోను అటు పశ్చిమబెంగాల్లోను డీఎంకే, తృణమూల్ అధికారంలోకి రావటం వెనుక పీకే కృషి కూడా చాలానే ఉంది.
నిజానికి తమిళనాడుకు పశ్చిమబెంగాల్ కు సంస్కృతిపరంగానే కాకుండా రాజకీయ వాతావరణంలో కూడా చాలా తేడా ఉంటుంది. అయినా కానీ ఇటు స్టాలిన్ అటు మమతబెనర్జీ ఇద్దరూ తమను ఎన్నికల్లో గెలిపించేందుకు ఒకేసారి వ్యూహకర్తగా పీకేని నియమించుకున్నారు.
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో మొదటిసారి డీఎంకే ఎన్నికలను ఎదుర్కొన్నది. అలాగే బెంగాల్లో మూడోసారి మమత ఎన్నికల పోరాటంలోకి దిగింది.
నిజానికి పీకేని మొదటగా గుర్తించింది నరేంద్రమోడినే. 2014లో మోడిని ప్రధానమంత్రిని చేసేందుకు పీకే బృందం దేశవ్యాప్తంగా చాలా కష్టపడింది. మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడో ఇద్దరికీ చెడింది. దాంతో మోడికి పీకే దూరమైపోయారు.
అయితే మోడి విజయం వెనుక పీకే ఉన్నారనే ప్రచారం బాగా జరిగింది. దాంతో వెంటనే పీకేని బీహార్లో నితీష్ చేరదీశారు. తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. అప్పుడు నితీష్ కూడా మంచి విజయమే సాధించారు.
ఆ తర్వాత పీకేని పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. అయితే యూపీలో దారుణంగా విఫలమైనా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ మంచి విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత ఏపి ఎన్నికల్లో విజయం కోసం పీకేతో జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేశారు. జగన్ అద్భుత విజయం సాధించటంతో వెంటనే స్టాలిన్, మమతలు పీకేతో ఒప్పందం చేసుకున్నారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లలో గెలిచింది. దాంతో క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను అంచనా వేసుకన్న దీదీ వెంటనే పీకేను వ్యూహకర్తగా నియమించుకున్నది. ఇదే సమయంలో తమిళనాడులో స్టాలిన్ కూడా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.
దాదాపు ఇద్దరితోను ఏకకాలంలో రెండేళ్ళు పీకే బృందం పనిచేసింది. స్టాలిన్, మమత స్టామినాకు పీకే వ్యూహాలు కూడా తోడైన కారణంగా ఇద్దరు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఇద్దరి విజయంలో కీలకపాత్ర పోషించిన పీకే ఇకనుండి తాను వ్యూహకర్త బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించం సంచలనమే. కాకపోతే మంచి విజయంలో ఉన్నపుడు రిటైర్ మెంట్ అయితే ఆ గౌరవమే వేరు. అందుకే ఇపుడు రిటైర్ మెంట్ ప్రకటించారు.
కొసమెరుపు – అయితే, పీకే గెలిపిస్తున్నాడు గాని దానికోసం అడ్డదారులు, డ్రామాలు ఎక్కువ ఆడతాడు అన్న నింద ఉంది. బెంగాల్లో మమత కాలికి కట్టుతో, జగన్ కి కోడికత్తితో అది నిజమైంది. చివరకు ఆ కోడికత్తి వ్యక్తి వైసీపీ టికెట్ కూడా వచ్చింది.