కాల మహిమ కాకపోతే ఏమిటి? గతంలో ప్రజల తరఫున ప్రజలకు మేలు జరిగే అంశాలపై ఫోకస్ చేసి.. వార్తలు రాయటం ఉండేది. కొన్నేళ్ల నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లోని మీడియా సంస్థలకు భిన్నమైన తీరు.. పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి.
తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడి అధికారపక్షమైన టీఆర్ఎస్ ఇంటి పత్రిక నమస్తే తెలంగాణ వర్సెస్.. సంచలనాలకు మారు పేరుగా నిలుస్తూ.. తన నిర్భీతి అక్షరాలతో అధికారంలో ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేయటంలో ఆంధ్రజ్యోతి ముందుంటుంది.
అయితే.. గడిచిన కొద్దికాలంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తల్ని పట్టుకొని.. దాని కౌంటర్లను పేజీల కొద్దీ వండి వార్చటం నమస్తే తెలంగాణ పత్రికకు ఒక అలవాటుగా మారింది. అయినా.. ఒక మీడియా సంస్థ.. మరో మీడియా సంస్థ కథనాన్ని ఖండిస్తూ.. తన మీడియాలో రాసుకోవటం ఏమిటి? అన్న చిన్నపాటి ప్రశ్న లేకుండా వ్యవహరిస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తనపై నిందలు మోపుతూ.. నమస్తే తెలంగాణ వినిపించిన వాదనకు తాజాగా ఆంధ్రజ్యోతి ఘాటైన రీతిలో రియాక్షన్ ఇచ్చింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆంధ్రజ్యోతి వరకు.. ఎవరైనా తమను కానీ.. తమ రాతల్ని కానీ తప్పు పట్టినా? అందులోని వార్తల్లో లోపాలు ఎత్తి చూపిస్తే.. భారీ ఎత్తున వాదనను వినిపించటంతో పాటు.. మళ్లీ కౌంటర్ ఇవ్వటానికి ఆలోచించేలా కథనాల్ని అచ్చేయటం.. ఆ దెబ్బకు తమను టార్గెట్ చేసిన వారికి చెమటలు పట్టేలా చేయటం ఆంధ్రజ్యోతికి అలవాటే. తాజాగా మళ్లీ అలాంటి పంచ్ లే వేసింది నమస్తేకు.
తెలంగాణ అధికారపక్ష హోదాలో.. ప్రభుత్వ ఘనత గురించి గొప్పలు చెప్పుకుంటూ.. తమ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేలా ఆంధ్రజ్యోతి వ్యవహరించిందన్న వాదనను వినిపించిన నమస్తేకు.. నోట మాట రాని రీతిలో కౌంటర్ ఇచ్చేయటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. నమస్తే వర్సెస్ ఆంధ్రజ్యోతి మధ్య నడుస్తున్న లడాయి ఒక పట్టాన తేలేలా కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది.
నమస్తేకు సిం‘ఫుల్’ గా తలంటిన ఆంధ్రజ్యోతి ఆర్గ్యుమెంట్ లో కీలకమైన అంశాల్ని చూస్తే..
- అది ఆంధ్రజ్యోతి అయినా.. నమస్తే అయినా.. మరొకటి అయినా! ఉదాహరణకు, కాఫీ తాగితే మంచిదని ఒక అధ్యయనం చెబుతుంది. మంచిది కాదని మరొక అధ్యయనం వెల్లడిస్తుంది. ఆయా అధ్యయనాలు ఆయా సంస్థల పరిశోధన ఫలితమే తప్ప.. పత్రికలకు ఎటువంటి సంబంధమూ ఉండదు. ఈ చిన్న లాజిక్‌ను మిస్సయిన అధికార పార్టీ పత్రిక ‘ఆంధ్రజ్యోతి’పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కేసింది. వరి సాగుపై సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎ్‌సఏ) చేసిన అధ్యయనాన్ని ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’కి దురుద్దేశాలు ఆపాదిస్తూ మరోసారి దుష్ప్రచారం చేసింది. ఇదే అధ్యయనాన్ని అంతకు ముందే కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురించినా.. కేవలం ‘ఆంధ్రజ్యోతి’పైనే తన విషపు రాతలను ఎక్కుపెట్టింది.
- ఉప్పుడు బియ్యం కేంద్రం కొనడం లేదని, వరి సాగు చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. రైతులకు వరి విత్తనాలు విక్రయించవద్దంటూ ఏకంగా దుకాణాలకు ఆదేశాలు కూడా వ్యవసాయ శాఖ జారీ చేసింది. ‘‘రాష్ట్రంలో ఇక ముందు వరి సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే రైతులు ఉరి వేసుకోవడమే’’ అని నెల రోజుల కిందట సెప్టెంబరు 11వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది కూడా.
- ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించడం లేదు కనక.. ధాన్యం సేకరణకు ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో సర్కారు ఈ వాదనను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయి. ఇదంతా కొనుగోలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో భాగం. అయితే, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వరి సాగును తగ్గించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎ్‌సఏ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది.
- ఇదంతా చూసినప్పుడు ప్రభుత్వ ప్రచారం.. సీఎ్‌సఏ అధ్యయన ఫలితం ఒకటే! అయినా.. దీనిపైనా అధికార పార్టీ పత్రిక వితండ వాదం చేసింది. తమ అధికార పార్టీ, తమ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా.. ఏకంగా అధ్యయనాన్ని తప్పుబట్టింది! అధ్యయనం చేసిన సంస్థను తప్పుబట్టింది! వాటిని అడ్డు పెట్టుకుని ‘ఆంధ్రజ్యోతి’ని తప్పుబట్టింది! కానీ, ఆ వార్త చివర్లోనే ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్లాన్ ఉందని చెప్పింది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టిందని కూడా పేర్కొంది.
- వరి సాగుకు రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారని, పైగా, వరి పొలంలో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండక తప్పదని, ఫలితంగా మీథేన్, నైట్రస్ ఆక్సైజ్ ఉత్పత్తి అవుతున్నాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎ్‌సఏ) శాస్త్రవేత్తలు తేల్చారు. వారి అధ్యయన సారాంశాన్నే ‘ఆంధ్రజ్యోతి’ కథనంగా ప్రచురించింది. అందులో ఆంధ్రజ్యోతి విశ్లేషణ కానీ అభిప్రాయం కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. అధ్యయన వివరాలను శాస్త్రవేత్తల మాటల్లోనే పేర్కొంది.
- వరి సాగుతో గ్రీన్ హౌజ్ గ్యాసులు ఉత్పత్తి అవుతాయనే ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన పలువురు వ్యవసాయాధికారులు ఏకీభవించారు. కానీ, ‘నమస్తే తెలంగాణ’ మాత్రం తప్పుడు భాష్యం చెప్పింది. రికార్డు స్థాయిలో వరి సాగు చేస్తుంటే కాలుష్య కార్ఖానా అంటారా అంటూ ‘ఆంధ్రజ్యోతి’పై విషం చిమ్మింది. కానీ, విచిత్రం ఏమిటంటే. నమస్తే తాను రాసిన అక్కసు వార్తలోనే ‘వరి నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని గతంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది’ అని స్వయంగా రాసుకుంది. ఎందుకు రాస్తున్నామో స్పష్టత లేకుండా తన వార్తను తానే ఖండించుకుంటూ అక్కసును వండి వార్చేసింది.
- తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అయితే ‘ఆంధ్రజ్యోతి’ పట్టించుకోలేదని, హరితహారం విజయాలూ ఆ పత్రికకు పట్టలేదంటూ అపవాదులు, అసత్యాలు, దుష్ప్రచారాలను నమస్తే వండి వార్చింది. కానీ, మిషన్ కాకతీయతో పాలమూరు పచ్చబడిందని నమస్తే కంటే ముందే.. మొట్టమొదట ‘ఆంధ్రజ్యోతి’నే ప్రచురించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం కానుందని.. అయిందంటూ అందరి కంటే ముందే ప్రత్యేక కథనాలను ప్రచురించింది.
- ‘జల జలహే తెలంగాణ’ అంటూ ప్రజల కళ్లకు కట్టింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయిందని, బంగారు పంటల కోనలా మారిందని, ‘ఆహా’ర తెలంగాణగా ఆవిర్భవించిందని, రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తోందని పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. అలాగే, ‘హరిత హారం’ కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని వివరించింది.
- ‘తెలంగాణ ఏడాదిలో మాగాణమైందని’ పేర్కొంటూ ‘ఆంఽధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు కూడా. అంతేనా, ఆయుల్ పామ్ సాగు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోందని చెబుతూనే.. సంబంధిత విశ్లేషణలనూ అందించింది. అయినా, ఇవేమీ పట్టని నమస్తే తెలంగాణ ఎప్పట్లాగే తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుంది.