రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. కాలేజీ స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం సరికాదని, ఆర్ట్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా మార్చితే నూతన భవనాల నిర్మాణానికి చోటుందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని అన్ని పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయిేత,ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కాకుండా వేరే చోట నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో, ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తాను వ్యతిరేకమని ఉండవల్లి స్పష్టం చేశారు. అంతేకాదు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 200 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపట్టాలని ఉండవల్లి సూచించారు.
ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సెంట్రల్ జైలులోని స్థలంలో పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదన ఆగిపోయిందన్నారు. అంతేకాదు, అప్పట్లో స్టేడియం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ జైలు శాఖ ఇచ్చిన ఉత్తర్వుల నకలును కూడా ఆ లేఖతో పాటూ పంపారు. మరి, ఉండవల్లి స్పెషల్ రిక్వెస్ట్ కు జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.