సాధారణంగా పుట్టిన రోజు వేడుక అంటే.. అంతో ఇంతో ఊపు ఉత్సాహం కామనే.అయితే.. ఎంతైనా.. మరీ రికార్డింగులతో అదరగొట్టేయరు కదా. అది కూడా.. పబ్లిగ్గా!! కానీ.. వైసీపీ ఎమ్మెల్యే మాత్రం తన పుట్టిన రోజు వేడుకల్లో రికార్డింగులు డ్యాన్సులు.. అశ్లీల నృత్యాలతో అదరగొట్టేశారు. ఆయనే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ఆయన బర్త్‌డే సందర్భంగా దర్శిలో మంగళవారం రాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు వేశారు.
స్థానిక గడియార స్తంభం సెంటర్లో మంగళవారం రాత్రి వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు వేదికపై రెచ్చిపోయి చిందేశారు. “లేలేలే.. నా రాజా..“ అంటూ.. ఓల్డ్ సాంగ్స్‌తో చిందేశారు. అంతేకాదు.. మహాజనానికి మరదలు పిల్ల.. అంటూ.. కొందరు ఆ యువతులను ఉద్దేశించి కామెంట్లు చేయడం కార్యక్రమంలో మరింత చర్చగా మారింది.
ఈ డ్యాన్స్‌లను ఎమ్మెల్యే వేణుగోపాల్, ఇతర వైసీపీ నాయకులు స్టేజీ మీద కూర్చోని ఈలలు వేస్తూ.. గోలలు చేస్తూ.. మరీ వీక్షించారు. ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా ఇలా పట్టణ నడిబొడ్డున రాకపోకలను నిలిపేసి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అయినా.. అధికారం మాది.. ఆ మాత్రం దర్పం మాకుండదా.. అని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. 12 గంటలకు ఎమ్మెల్యే కేకు కోసిన అనంతరం ఈ నృత్యాలు సాగినా ఆయన వారించకపోవడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం మరింత చర్చకు దారితీసింది.