పీకల్లోతు ఆర్థిక కష్టాలతో కిందా మీదా పడుతున్న వొడాఫోన్ ఐడియా అదిరే ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చింది. తాజాగా వేస్తున్న ప్లాన్ వర్కుట్ అయితే ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.16వేల కోట్ల వడ్డీ బకాయిలు ఒక కొలిక్కి రావటం ఖాయమని చెప్పాలి. అదే జరిగితే.. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా కింద 35.8 శాతం దక్కుతుంది. ఇదే జరిగితే రూ.1.95లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వమే అతి పెద్ద వాటాదారుగా మారుతుందని చెబుతున్నారు.
ఒకవైపు.. తన అధీనంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ లాంటి టెలికం కంపెనీ చేతులు కట్టేసి.. నడ్డి విరిచేసి.. వాటి ఆస్తుల్ని అమ్మేస్తున్న వేళ.. ఒకప్రైవేటు కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి భారీ వాటా లభించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. స్పెక్ట్రం వేలం వాయిదా మొత్తం.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిలపై కట్టాల్సిన వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్చటానికి 2022 జనవరి 10న జరిగిన సమావేశంలో బోర్డు డైరెక్టర్లు అంగీకరించారు.
ప్రస్తుతం వేసిన అంచనా ప్రకారం వడ్డీ నికర ప్రస్తుత విలువ రూ.16వేల కోట్లుగా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే.. టెలికాం విభాగం దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వొడాఫోన్న ఐడియా షేరు మంగళవారం 20 శాతానికి పైగా నష్టపోయింది. దీంతో.. బీఎస్ఈలో రూ.11.80 వద్ద.. ఎన్ఎస్ఈలో రూ11.75 వద్ద స్థిరపడింది.
బకాయిల్ని ఈక్విటీగా మారిస్తే కంపెనీలో ప్రమోటర్ల తో పాటు అందరి వాటా తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వానికి ముందుగా 35.8 శాతం వాటా వస్తుంది. ఈ వాటాను ప్రభుత్వం తరఫున యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియా కానీ మరే ఇతర ట్రస్టీ కానీ నిర్వహించే వీలుంది. దీంతో వొడాఫోన్ గ్రూపునకు 28.5 శాతం వాటా.. ఆదిత్య బిర్లా గ్రూపునకు 17.8 శాతం వాటా మిగులుతుంది. వాటా దార్లఒప్పందం కింద వాటాదార్లకు కంపెనీలో కనీసం 21 శాతం వాటా అవసరం. అయితే.. ఆదిత్య బిర్లా గ్రూపునకు 21 శాతం కంటే వాటా తగ్గున్న నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని సంస్థ సవరిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా.. బకాయిల వడ్డీ భారం నుంచి వొడాఫోన్ ఐడియా బయటపడుతుందా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.