ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ.. కేవలం ఉక్కు మాత్రమే తయారు చేసే.. పరిశ్రమగా మిగిలి పోలేదు. ఇప్పుడు అత్యంత భయంకరమైన కరోనా పరిస్థితిలో.. దేశానికే ప్రాణాలు పోస్తున్న అపర సంజీవనిగా నిలిచింది. ఎందుకంటే.. ఇప్పుడు నిరం తరం ఇక్కడ ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర,ఏపీ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్‌లకు కూడా గత ఏడాది కాలంగా ఆక్సిజన్ ఇక్కడ నుంచి నిరంతరాయంగా ఎగుమతి అవుతోంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విశాఖ ఉక్కును అత్యంత కారు చౌకగా అమ్మేస్తామని.. మోడీ సర్కారు భీష్మించింది.
ఎవరు ఎన్ని చెప్పినా.. తమ మాటే జరిగి తీరుతుందని.. పార్లమెంటులో బల్లగుద్ది మరీ చెప్పింది. దీనిపై ఏపీ ఎంపీలు.. పార్టీలకు అతీతంగా ఆందోళన చేశారు. ఇక, విశాఖలో అయితే.. ఉద్యోగులు.. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. అయినప్పటికీ.. నష్టాలు వస్తున్నాయని చెబుతున్న కేంద్ర పెద్దలు.. దీనిని ప్రైవేటీకరించే తీరుతామని అంటున్నారు.కానీ, ఇప్పుడు కేంద్ర చెబుతున్నట్టు.. `ఎందుకూ పనికి రాని` పరిశ్రమే దేశ ప్రజల ప్రాణాలకు ఆశా దీపంగా మారి.. గొడుగు పడుతోంది. నిత్యం వందల టన్నుల్లో మెడికల్ ఆక్సిజన్‌ను ఇక్కడి ఉద్యోగులు తయారు చేస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం.. గత ఏడాది కరోనా సమయంలో 2 లక్షల టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేశారు. ఇక, ఇప్పుడు కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చడంతోపాటు.. కరోనా తీవ్రత కారణంగా.. ఆక్సిజన్ లభించక వందల మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అయితే.. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వినియోగించే ఆక్సిజన్‌ను ఇప్పుడు రోగుల కోసం.. నిరంతరం తయారు చేస్తున్నారు. ఈ రెండు నెలల కాలంలో 17 వేల టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు.
దీంతో ప్రాణ వాయువు లభించక అశువులు బాసిపోతున్న ప్రాణాలకు ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాణాలు నిలబెడుతోంది. అదేసమయంలో నిరంతరం ఇక్కడి ఉద్యోగులు ఒకవైపు.. ఉద్యమాలు చేస్తూ.. మరోవైపు దేశ ప్రజల కోసం.. కరోనా భూతం నుంచి రోగులను రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. మోడీపై కోపం ఉన్నా.. దేశం కోసం వారు శ్రమిస్తున్న తీరు.. ప్రతి ఒక్కరి కంటా తడి పెట్టిస్తోంది. మరి ఇంత ప్రజోపకార సంస్థను ఇప్పుడు కూడా మసిపూసి మారేడు కాయ చేసినట్టు నష్టాల బూచిలో పెట్టి.. అమ్మేస్తారా? ఒకవేళ అలా అమ్మేస్తే.. ఇంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్ తయారు చేసుకునే ప్రైవేటు సంస్థలు.. ఏదైనా.. ఇలాంటి విపత్కర సమస్య వచ్చిన ప్పుడు ఉదారంగా ముందుకు వచ్చి.. ఆక్సిజన్ ఇస్తాయా? ప్రజల ప్రాణాలు రక్షిస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి మోడీ.. ఇప్పటికైనా వెనక్కి తగ్గాల్సిందే.. దేశాన్ని కాపాడుకునే పరిశ్రమను నిలబెట్టాల్సిందే అంటున్నారు ప్రజలు. మరి ఏం చేస్తారో చూడాలి.