కరోనా కష్టకాలంలో ఆంధ్రులకు ఊపిరి పోస్తోన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం బేరానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఆరు కోట్ల మంది ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్ర్రైవేటీకరిస్తున్నామంటూ మోడీ సర్కార్ ప్రకటించడంపై ఆంధ్రులతో పాటు తెలుగువారంతా మండిపడ్డారు. ఇక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపంలో కేంద్రానికి వంతపాడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్ సర్కార్ పైనా కార్మికులు, ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మొదలుపెట్టిన ఉద్యమం నేడు 100వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని…. విశాఖ ఉక్కు పరిరక్షణకు టీడీపీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని, వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేశారని, దానిని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం దేశానికి ఊపిరి పోసిందని చంద్రబాబు అన్నారు. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, దీనిపై పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు పెదవి మెదపడం లేదన్నారు. కానీ, జగన్ మాత్రం ప్రజలకోసం కంటితుడుపు చర్యగా అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. … వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గత 100 రోజులగా పోరాటం చేస్తున్న కార్మికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనలు తెలిపారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కరోనా రోగులకు ఊపిరి పోశారని కొనియాడారు. ఇప్పటికైనా ఏపీలో విశాఖ ఉక్కుపై దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మానాలని ,ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ టీడీపీ నేతల పోరాటం కొనసాగుతుందని అన్నారు.