- కలెక్టరేట్, రెండు తహశీల్దార్ కార్యాలయాలు,
- మరిన్ని ప్రభుత్వ ఆస్తులు ఏపీఎ్‌సడీసీకి బదిలీ
- ఆ తర్వాత తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట!
- రూ.1,600 కోట్ల కోసం తనఖానా?
- 15 శాఖల భూములు గుర్తింపు
ఏ క్షణంలోనైనా విశాఖకు పరిపాలనా రాజధానిని తరలిస్తామని అంటారు. ఇక అభివృద్ధికి పట్టపగ్గాలు ఉండవంటారు.. బంగాళాఖాతంలో అలల్లా పోటెత్తుతుందని జనాలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగేది చూస్తే ఎవరైనా కంగుతినడం ఖాయం. విశాఖలో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఇతరులకో, అస్మదీయులకో కట్టబెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది.
రాజకీయంగా విశాఖను గుప్పిట్లో ఉంచుకోవడం, నగరంలోని కీలక స్థలాలను స్వాధీనం చేసుకోవడం, బెదిరింపు దందాలకు దిగడం, కబ్జాలు చేయడం, గిట్టని వారికి చెందిన ఆస్తులను ధ్వంసం చేయడం.. నిన్నటిదాకా ఇదే జరిగింది. ఇప్పుడు ఏకంగా విశాఖ ప్రజలకు చెందిన, వారు గర్వంగా భావించే ప్రభుత్వ ఆస్తులనూ తనఖా పెట్టేస్తున్నారు.
రూ.1,600 కోట్ల అప్పు కోసం దిగజారుడు పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు విశాఖనగరం బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారిందన్నది రుజువైంది. విశాఖ నగరానికే ప్రత్యేకమైన కలెక్టర్ కార్యాలయంతోపాటు రెండు తహశీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిథిగృహం, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ కాలేజీ తదితర ప్రభుత్వ ఆస్తులు తనఖాలోకి వెళ్లిపోతున్నాయి.
మొత్తం 15 ప్రభుత్వ శాఖలకు చెందిన 213.56 ఎకరాలను తాకట్టు పెట్టి.. బ్యాంకుల నుంచి రూ.1,600 కోట్లు అప్పు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఎ్‌సడీసీ) పేరిట బదిలీ చేయాలంటూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారికి ఇటీవలే ఉత్తర్వులు జారీఅయ్యాయి.
తాజాగా జగదాంబ సెంటర్ సమీపంలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలం(1.93 ఎకరాలు), విశాఖ వేలీ స్కూల్ సమీపంలోని ఈవీఎంల గొడౌన్ సెంటర్(అర ఎకరా)ను కూడా తాకట్టు పెట్టబోతున్నారు. బక్కన్నపాలెంలో నాలుగు ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకం కేంద్రం గత ముప్పై ఏళ్లుగా నడుస్తోంది. శిక్షణ కూడా ఇచ్చేవారు.
గత కొంతకాలంగా ఇక్కడ కార్యక్రమాలు నడవడం లేదు. దానిని ఇప్పుడు తనఖా పెట్టేస్తున్నారు. అలాగే అక్కడకు సమీపంలో 19.54 ఎకరాల్లో దివ్యాంగుల శిక్షణ కేంద్రం ఉండేది. దీనికి ఆస్ర్టేలియా సంస్థ సాయం చేస్తోంది. ఇది కూడా తనఖా జాబితాలో ఉంది. ఈ రెండు సంస్థల భూమి మొత్తం 25 ఎకరాలు. అక్కడ ఎకరా రూ.20 కోట్లు వరకు ఉంది.
సరిగ్గా ఏడాది క్రితం..
మిషన్ ‘బిల్డ్ ఏపీ’ పేరిట గత ఏడాది జూన్ 10న విశాఖలోని పలు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెడుతూ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. కొన్నింటిని ఉన్నపళంగా, మరికొన్నింటిని అభివృద్ధి చేసి, ఆ భవనాల్లో చదరపు అడుగుల చొప్పున అమ్మడానికి ప్రయత్నించింది.
బుల్లయ్యకాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతీయ కంటి ఆస్పత్రి, డీఎంహెచ్ఓ కార్యాలయం, కుటుంబ సంక్షేమ, శిక్షణ కార్యాలయం నడుస్తున్న స్థలాలను అభివృద్ధి చేసి అమ్మడానికి ముందుకు రావాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చింది. ఈ కార్యాలయాలన్నీ మొత్తం 27.83 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి.
ఆ ప్రాంతంలో గజం లక్ష రూపాయలు పలుకుతోంది. అలాగే చినగదిలి, అగనంపూడి, ఫకీర్తకియా, సీతమ్మధార ప్రాంతాల్లో మరో 6.57 ఎకరాలను విక్రయిస్తామని ప్రకటన ఇచ్చింది. ఈ భూములు రెవెన్యూ, హోమ్, ఏపీఐఐసీ శాఖలకు చెందినవి. వీటిని విక్రయించడం కుదరదని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆయా పనులు ఆగిపోయాయి.
గుట్టుగా చేయాలనుకున్నారు
ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడితే న్యాయస్థానాల్లో కేసుల వల్ల ఆ ప్రక్రియ ముందుకుసాగడం లేదని, ఈసారి అడ్డంకులు రాకుండా గుట్టుగా చేయాలని అమరావతి నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు కొద్దిరోజులుగా ఈ వ్యవహారాన్ని రహస్యంగానే చేస్తున్నారు. అయితే విషయం పత్రికలకు పొక్కడంతో అధికారులు బిత్తరపోయారు.
ఇదెలా బయటకు వచ్చిందో ఆరా తీస్తున్నారు. ఎక్కడ తమను ఇరికిస్తారేమోనని దిగువ స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అమరావతి సచివాలయ అధికారులు కూడా జిల్లా అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా ఈ ప్రక్రియ ఎక్కడా ఆగలేదు. సర్వే పనులు కొనసాగుతున్నాయి. నివేదికలు తయారవుతున్నాయి.
ఆస్తుల సృష్టికి కాదు..
రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక ప్రణాళికలు, ఫైనాన్సింగ్, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, కార్యక్రమాల కోసం కొత్తగా ఏపీఎ్‌సడీసీని ఏర్పాటు చేశారు. పేరులో ‘అభివృద్ధి’ ఉన్నప్పటికీ… దీని ప్రధాన లక్ష్యం ఆస్తులు సృష్టించడం కాదు! కేవలం అప్పులు తీసుకురావడం.
దీని ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా రూ.25 వేల కోట్ల రుణాలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కొత్తగా ఏర్పాటైన సంస్థ కావడం, దాని అఽధీకృత మూలధనం రూ.5 లక్షలు మాత్రమే కావడంతో అన్ని వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో.. మద్యంపై అదనపు పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేస్తున్నామని చెప్పి.. ఆ ఆదాయాన్నే ‘ష్యూరిటీ’గా చూపించారు. రూ.18,500 కోట్ల రుణాన్ని సేకరించారు.
ఇప్పుడు… ఈ సంస్థకు నికరంగా పది శాతం మూలధనం, అంటే రూ.2,500 కోట్లు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.900 కోట్లు ఇతర మార్గాల్లో ఇవ్వనున్నారు. మరో రూ.1,600 కోట్ల కోసం… పాలకుల దృష్టి విశాఖపట్నంపై పడింది.