వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని దేశపు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని, సాక్షులను నిందితులు, అనుమానితులు ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కేసు విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారులపై కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సీబీఐ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. కేసు ఎందుకు బదిలీ చేయాలన్న కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఏపీకి దగ్గరగా హైదరాబాద్ ఉందని, అందువల్ల కేసును అక్కడకు బదిలీ చేస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు.
కర్ణాటక సహా ఏ రాష్ట్రమైనా అభ్యంతరం లేదని అన్నారు. ఈ కేసు విచారణను ఎక్కడకు బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం నాడు తమ తీర్పులో వెలువరిస్తామని సుప్రీం చెప్పింది.