మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత సీబీఐకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. సీబీఐ విచారణ అధికారులకు సునీత ఇచ్చిన వాంగ్మూలంలో కొత్త వివరాలు బయటకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి తన ఇంటికి వచ్చి.. తనతో ఏం చెప్పారన్న విషయంతో పాటు.. తనతో చేసిన చాటింగ్ మెసేజ్ ల స్క్రీన్ షాట్లను ఆమె సీబీఐకు ఇచ్చారు.సీబీఐకు సునీత ఇచ్చిన వాంగ్మూలంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
– 2019 మార్చి 19 నుంచి మార్చి 29 వరకు నాలుగుసార్లు మీడియాతో మాట్లాడాను. మాది చాలా పెద్ద కుటుంబం.. దాదాపుగా 700 మందికి పైగా సభ్యులున్న కుటుంబం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ మమ్మల్ని మేం చంపుకొనే మనుషులం కాదని చెప్పాను. నా తండ్రిని అందరూ గౌరవిస్తారు.. ఆయన బతికున్నప్పుడు ఎలాంటి మర్యాదిచ్చారో ఇప్పుడు కూడా దయచే సి అలాగే ఇవ్వండని చెప్పాను.
– నా తండ్రి హత్యపై వాస్తవాలు వెలికితీసే అధికారులకు తప్పుడు ప్రచారాలు అడ్డంకిగా మారతాయి.. హత్యను విచారించేందుకు ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది.. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.. పోలీసులను వారి డ్యూటీ చేయనివ్వండి. ప్రచారాలతో ప్రభావితం చేయొద్దని కోరాను. జగన్‌ను సీఎంగా చూడడం నా తండ్రి కల.. దానిని నిజం చేసేందుకు ఆయన శక్తివంచన లేకుండా పనిచేశారని చెప్పాను.
– 2019 మార్చి 22న నేను కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశాను. ఈ సమావేశాన్ని ధర్మారెడ్డి ఏర్పాటుచేశారు. ఆయనెవరో అప్పుడు నాకు తెలీదు. ఢిల్లీలోని వైఎస్ అవినాశ్‌రెడ్డి అపార్ట్మెంట్లోనే మేం ఉన్నాం. మమ్మల్ని ఎన్నికల కమిషనర్ వద్దకు తీసుకెళ్లేందుకు ధర్మారెడ్డి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత నేను హోం సెక్రటరీని కలవడానికి సీఈసీ సహకరించింది.
– సీఈసీ ఆఫీసు బయట మీడియాతో మాట్లాడాను. మా తండ్రి హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని పునరుద్ఘాటించాను. 2019 మార్చి 22న హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. మార్చి 23న నాకు వైఎస్ భారతీరెడ్డి నుంచి కాల్ వచ్చింది. నన్ను కలవాలని ఫోన్ లో చెప్పింది. అయితే.. అర్జెంట్ గా సైబరాబాద్ కమిషనరేట్ కు వెళ్లాలి. తర్వాతి ఫ్లైట్ లో కడపకు వెళ్లాల్సి ఉండటంతో కలవటం కుదరదని చెప్పా.
– ఎక్కువ టైం అవసరం లేదని.. వచ్చి కలవాలని భారతి అడిగారు. నేను కమిషనరేట్ కు వెళ్లాల్సిన టైంలో భారతినే మా ఇంటికి వచ్చింది. మా పెద్దమ్మ వైఎస్ విజయలక్ష్మి.. వైఎస్ అనిల్.. సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా వచ్చారు. వీరిని చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను లిఫ్టు దగ్గర నిలబడి భారతితో మాట్లాడుతున్నాను. ఆమె కొంచెం గాబరాగా కనిపించారు.
– నా తండ్రి మరణం తర్వాత మొదటిసారి ఆమె మా ఇంటికి వచ్చినందుకు బాధపడుతోందని అనుకున్నాను. ఇక నుంచి నువ్వు ఏం చేసినా సరే.. సజ్జల రామక్రిష్ణారెడ్డితో టచ్ లో ఉండాలని చెప్పింది. తర్వాత సజ్జల నన్ను మీడియాతో మాట్లాడమన్నారు. ఈ ప్రతిపాదన నాకు ఇబ్బందిగా మారింది.
– మీడియాతో మాట్లాడటం ఇబ్బందిగా ఉండటంతో కడప సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ సాయంతో వీడియోను రికార్డు చేశాను. ఇన్ స్పెక్టర్ శంకరయ్య క్రైమ్ సీన్ లో ఉండి సాక్ష్యాధారాలు తుడిచేయటంపై కంప్లైంట్ చేశాను. మా కుటుంబ సభ్యులపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండటం తప్పని భావించా. ఆ వీడియోను చూసి సజ్జల చూశారు. అలా ఉండకూడదన్నారు.
– ఒక ప్రెస్‌మీట్‌ను భారీస్థాయిలో ఏర్పాటు చేసి వివేకా హత్య చాప్టర్ క్లోజ్ చేయాలి.. ఇక ఈ టాపిక్‌పై మీడియాలో చర్చ జరగడం తనకిష్టం లేదన్నట్లుగా నాకు చెప్పారు. ఆ ప్రెస్మీట్లో నా తండ్రి.. జగన్ అన్నతో పాటు అవినాశ్‌రెడ్డి కోసం కూడా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పాలని సజ్జల సలహా ఇచ్చారు. అప్పటి వరకు అవినాశ్ పేరు నేనెక్కడా ప్రస్తావించలేదు.
– నేను హైదరాబాద్ తిరిగి వచ్చి సజ్జల సలహా మేరకు ప్రెస్‌క్లబ్‌లో మధు ధాత్రి సహాయంతో ప్రెస్‌మీట్ నిర్వహించాను. అంతకంటే ముందు మార్చి 24 నుంచి మార్చి 26 మధ్యన నా దగ్గర ఉన్న పవర్ పాయింట్ ప్రజంటేషన్లను సలహాలు, ఆమోదం కోసం మధు ధాత్రికి, సజ్జలకు పంపాను.
– ఆయన మళ్లీ నన్ను అవినాశ్‌రెడ్డి కోసం కూడా తన తండ్రి ప్రచారం చేసినట్లుగా చెప్పాలన్నారు. దీనిపై కొంత తటపటాయించాను. ఎందుకంటే నా తండ్రికి అవినాశ్‌రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు. పైగా మా కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలున్నాయి.
– అప్పటి ముఖ్యమంత్రి (చంద్రబాబు) తన ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి స్పందిస్తున్న తీరులో కొంచెమైనా నిజముంటే ఎందుకు అసలు కుట్రదారులను పట్టుకోలేకపోతున్నారని నాలో నేనే అనుకున్నాను. పోలీసులు వాళ్లను ఎందుకు వదిలిపెడుతున్నారు.. అలాగే క్రైమ్సీన్ని ఎందుకు శుభ్రం చేశారనేది నాకింకా అప్పటికి అర్థం కాని విషయం.
– సాక్ష్యాల్ని తుడిపేయటంలో మా కుటుంబం కారణమని నేనెలా అనుకుంటాను? తర్వాత నేను పొరపాటు పడ్డానని అర్థమైంది. క్రిమినల్స్ ఎలా ప్రవర్తిస్తారో తెలియక పొరపాటు పడ్డాను.
– జగన్ ను సీఎంగా చూసేందుకు నా తండ్రి చాలా కష్టపడ్డారు. వేరెవరో చేసిన తప్పిదం.. మళ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవటానికి కారణం కాకూడదనుకున్నాను.
– 2019 అక్టోబరు 5వ తేదీన వాట్సాప్ చాట్, మెసేజ్‌లకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను సీబీఐ వాళ్లకు అప్పగించాను. 2019 మార్చి 15 నుంచి 2019 మార్చి 21 మధ్య నాకు, భారతికి మధ్య మెసేజ్‌ల స్ర్కీన్ షాట్లు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 7 వరకు నాకు, భారతికి మధ్య మెసేజ్‌ల స్ర్కీన్ షాట్లు.. మార్చి 27వ తేదీన సజ్జల రామకృష్ణారెడ్డికి, నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ల స్ర్కీన్షాట్లు ఇచ్చాను.
– 2022 మే 13వ తేదీన నేను ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కి వెళ్లి రెండు పెన్‌డ్రైవ్‌లు వారికి అప్పగించాను. మొదటి పెన్‌డ్రైవ్‌లో 7 ఫోల్డర్లు/ఫైళ్లున్నాయి. రెండో పెన్‌డ్రైవ్‌లో 11 ఫోల్డర్లున్నాయి.
– నా తండ్రి మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల వెళ్లాం. అక్కడి నుంచి పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీకి వెళ్లాం. నేను డాక్టర్ ను కాబట్టి నా తండ్రి ఒంటి మీద ఉన్న గాయాల్ని పరిశీలించాను. నేను బయటకు వచ్చాక నా చేతికి ఒక లెటర్ ఇచ్చి సంతకం చేయాలన్నారు. బీటెక్ రవి.. మరికొందరు టీడీపీ నాయకులకు నా తండ్రి హత్యను ముడిపెడుతూ రాసిన కంప్లైంట్ లేఖ అది.
– జమ్మలమడుగులో వైసీపీ గెలుపు కోసం వివేకానందరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, దీంతో ఓడిపోతామేమోనన్న భయంతో టీడీపీ నాయకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని అవినాశ్‌రెడ్డి నాకు చెప్పారు. అయితే.. ఆ లేఖ మీద సంతకం చేయలేదు.
– 2019 జూలై నుంచి అనుమానం మొదలైంది. వివేకా హత్య గురించి ప్రజలందరికీ తెలియడం కంటే ముందే తన కుమారుడికి తెలుసని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి కొందరికి చెప్పాక అనుమానం మొదలైంది. నా తండ్రి హత్య వెనుక అవినాశ్ పాత్రపై అనుమానాలున్నాయని 2019 ఆగస్టు 1వ తేదీన కడప ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను.
– అవినాశ్‌కు, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు. అందుకే నా తండ్రి హత్య వెనుక వీరంతా ఉన్నారనే అనుమానం వచ్చింది.